FabiSpray | ముక్కులో స్ప్రే ద్వారా కోవిడ్‌కు చికిత్స..
Fabispray | గ్లెన్‌మార్క్ ఔషధ సంస్థ కోవిడ్-19తో బాధపడుతున్న రోగుల(వయోజనులు) చికిత్స కోసం శానోటైజ్ భాగస్వామ్యంతో భారతదేశంలో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (FabiSpray)ని మార్కెట్లోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్ ఔషధ సంస్థ కోవిడ్-19తో బాధపడుతున్న రోగుల(వయోజనులు) చికిత్స కోసం శానోటైజ్ భాగస్వామ్యంతో భారతదేశంలో నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ఫ్యాబి స్ప్రే (FabiSpray)ను మార్కెట్లోకి తెచ్చింది. గ్లెన్‌మార్క్ యాక్సిలరేటెడ్ అప్రూవల్ ప్రాసెస్‌లో భాగంగా నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రేకు డ్రగ్ రెగ్యులేటర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తయారీకి, మార్కెటింగ్‌కు ఆమోదం పొందింది.
‘భారతదేశంలో ఫేజ్ 3 ట్రయల్ లక్షాలను సాధించింది. 24 గంటల్లో 94 శాతం, 48 గంటల్లో 99 శాతం వైరల్ లోడ్ తగ్గింపు సాధ్యమైంది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) సురక్షితమైంది. గ్లెన్‌మార్క్ ఫాబిస్ప్రే బ్రాండ్ పేరుతో NONSని మార్కెట్ చేయనుంది’ అని గ్లెన్‌మార్క్ అధికారిక ప్రకటన తెలిపింది.
నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ను నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు అది వైరస్‌కు వ్యతిరేకంగా భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
‘FabiSpray ఎగువ శ్వాస నాళాలలో COVID-19 వైరస్‌ను చంపడానికి రూపొందింది. ఇది SARS-CoV-2పై ప్రత్యక్ష వైరస్‌ను ప్రభావితం చేసే యాంటీ-మైక్రోబయల్ లక్షణాలను నిరూపించింది. నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు NONS భౌతిక, రసాయన అవరోధంగా పనిచేస్తుంది. వైరస్ ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది’ అని ప్రకటనలో సదరు సంస్థ వెల్లడించింది.
సురక్షితంగా.. సమర్థవంతంగా
COVID-19 కోసం స్ప్రే సమర్థవంతమైన, సురక్షితమైన యాంటీవైరల్ చికిత్సగా పేర్కొంటూ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబర్ట్ క్రోకార్ట్ ‘ఇది రోగులకు చాలా అవసరమైన, సమయానుకూలమైన చికిత్స ఎంపికను అందిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.
‘ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ ప్లేయర్‌గా COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో అంతర్భాగంగా ఉండటం చాలా ముఖ్యం. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (FabiSpray) కోసం నియంత్రణ ఆమోదం పొందడం, SaNOtize భాగస్వామ్యంతో ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది’ రాబర్ట్ క్రోకార్ట్ తెలిపారు.
అధ్యయన ప్రధాన పరిశోధకులలో ఒకరైన డాక్టర్ శ్రీకాంత్ కృష్ణమూర్తి దీనిని వివరిస్తూ ‘అధ్యయన ఫలితాలను వీక్షించే అవకాశం నాకు లభించింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే వైరస్ లోడ్‌ను తగ్గిస్తుంది. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్‌కు దారితీసే ప్రారంభంలో ఉపయోగించినప్పుడు RT-PCR నెగెటివిటీని వేగవంతంగా రికవరీ చేస్తుంది. మరీ ముఖ్యంగా NONS వైరల్ లోడ్ తగ్గింపు, వ్యాప్తిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. NONS సురక్షితమే కాకుండా, ఈ చికిత్సా ఎంపిక ఆకర్షణీయమైంది..’ అని పేర్కొన్నారు.