Covid | ఢిల్లీలో పెరిగిన 'ఆర్' వాల్యూ.. కొవిడ్ నాలుగో వేవ్ తప్పదా?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్న క్రమంలో.. వారం రోజుల్లో ఆర్ వాల్యూ 2.1కు చేరింది. ఇది నాలుగో వేవ్‌కు సంకేతమా? అన్న ప్రశ్నకు నిపుణులు జవాబిచ్చారు.
Delhi covid news | ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా.. ఢిల్లీలో 'ఆర్' వాల్యూ.. 2 దాటినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో ఆర్ వాల్యూ 2.1కు చేరిందని ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు వెల్లడించారు. అంటే.. ప్రతి రోగి.. మరో ఇద్దరికి వైరస్‌ను వ్యాపింపజేస్తున్నట్టు అర్థమని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ నాలుగో వేవ్‌పై భయాలు నెలకొన్న వేళ.. ఢిల్లీ ఆర్ వాల్యూపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ఆర్ వాల్యూతో.. వైరస్‌ను ఓ వ్యక్తి ఎంతమందికి వ్యాపింపజేస్తున్నడో లెక్కగట్టవచ్చు. ఆర్ వాల్యూ 1 కన్నా తక్కువకు పడిపోతే.. మహమ్మారి దశ ముగిసినట్టు పరిగణిస్తారు.
Delhi covid r value | ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎస్ సుదంర్ నేతృత్వంలోని ఐఐటీ మద్రాసు డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమెటిక్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మేథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ విభాగం.. కంప్యూటైజేషన్ మోడలింగ్ ద్వారా ఈ ఆర్ వాల్యూను లెక్కగట్టారు.
ఢిల్లీలో ఆర్ వాల్యు 2.1కు చేరగా.. ఇండియా మొత్తం మీద ఆర్ వాల్యూ 1.3గా ఉందని నిపుణులు వెల్లడించారు.
నాలుగో వేవ్‌కు సంకేతమా?
Covid fourth wave | ఢిల్లీ ఆర్ వాల్యూ పెరగడం.. నాలుగో వేవ్‌కు సంకేతమా? అన్న ప్రశ్నపై నిపుణులు స్పందించారు. ఈ విషయంపై ఇప్పడే ఏదీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు. నాలుగో వేవ్‌పై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇమ్యూనిటీ పరిస్థితులపై ఇంకా అవగాహన లేదని, మూడో వేవ్‌లో వైరస్ బారినపడ్డ వారికి మళ్లీ కొవిడ్ సోకుతోందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలని వివరించారు.
ముంబై, చెన్నై, కోల్‌కతాలో కేసులు తక్కువే ఉన్నాయని, నాలుగో వేవ్ ట్రెండ్‌ను ఇప్పుడే పసిగట్టలేమని నిపుణఉళఉ అంటున్నారు.
ఢిల్లీలో పాజిటివీ రేటు 4.64శాతంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 1,042 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. ఢిల్లీలో తాజా పరిస్థితులకు కొత్త వేరియంట్ కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2.12.1ను రోగుల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు. అయితే.. ఇది కొత్త వేరియంటేనా? కాదా? అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్