CM Mamata Banerjee: “అలా అయితే నా తల నరికేయొచ్చు”: ఉద్యోగులపై సీఎం మమతా బెనర్జీ అసహనం-chop off my head if not happy with da mamata benerjee on employees protests ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cm Mamata Banerjee: “అలా అయితే నా తల నరికేయొచ్చు”: ఉద్యోగులపై సీఎం మమతా బెనర్జీ అసహనం

CM Mamata Banerjee: “అలా అయితే నా తల నరికేయొచ్చు”: ఉద్యోగులపై సీఎం మమతా బెనర్జీ అసహనం

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 07, 2023 07:20 AM IST

CM Mamata Banerjee: మరింత డీఏ ఇవ్వాలంటూ ఉద్యోగులు, ప్రతిపక్షాలు చేస్తున్న చేస్తున్న ఆందోళనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇంకెంత ఇవ్వాలంటూ ప్రశ్నించారు.

CM Mamata Banerjee: “అలా అయితే నా తల నరికేయండి”: సీఎం మమతా బెనర్జీ
CM Mamata Banerjee: “అలా అయితే నా తల నరికేయండి”: సీఎం మమతా బెనర్జీ (HT_PRINT)

CM Mamata Banerjee: అదనపు కరవు భత్యం (Dearness Allowance -DA) కోసం రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు, ఆందోళనపై పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మద్దతుతో ఉద్యోగులు నిరసన చేస్తుండడంపై ఆమె అసహనం చెందారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఎంత ఇవ్వాలి?

CM Mamata Banerjee: ఉద్యోగులకు అదనంగా 3 శాతం డీఏ ఇచ్చామని ఇంకెంత ఇవ్వాలని ప్రశ్నించారు సీఎం మమతా. “వాళ్లు ఇంకా కావాలని అడుగుతూనే ఉన్నారు. నేను ఇంకా ఎంత ఇవ్వాలి?. ఇంకా డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర (ప్రభుత్వం) డబ్బు లేదు” అని అసెంబ్లీ వేదికగా సోమవారం మమతా బెనర్జీ చెప్పారు.

నా తల నరికేయొచ్చు

CM Mamata Banerjee: మరింత డీఏ కావాలని ఉద్యోగులు, ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‍పై మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. “మేం అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. దాంతో మీకు సంతోషం కలగకుంటే మీరు నా తల నరికివేయవచ్చు. మీకు ఇంకా ఎంత కావాలి?” అని ఉద్యోగులను మమతా ప్రశ్నించారు.

టీచర్లు, పెన్షనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3 శాతం అదనంగా డీఏ ఇవ్వనున్నట్టు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్య వెల్లడించారు. మార్చి నుంచి ఇది వర్తిస్తుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలికేల!

CM Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే తమ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను అధికంగా ఇస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. డీఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకోవడం సరికాదని అన్నారు.

“కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేళ్లు విభిన్నంగా ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేశాయి. వేతనాలతో కూడిన సెలవులను ఏ ప్రభుత్వం ఎక్కువగా ఇస్తోంది?” అని మమత అన్నారు. “ప్రభుత్వ ఉద్యోగులకు మేం రూ.1.79లక్షల డీఏ మొత్తాన్ని ఇచ్చాం. వేతనాలతో కూడిన 40 సెలవులను ఇస్తున్నాం. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోలుస్తున్నారు? మేం బియ్యాన్ని ప్రజలు ఉచితంగా ఇస్తున్నాం. కానీ వంట గ్యాస్ ధర ప్రస్తుతం ఎలా ఉంది?. ఎన్నికలు ముగిసిన ఒక్క రోజు తర్వాతే వారు (కేంద్రం) ధరలు పెంచారు. మీరు సంతృప్తి చెందాలంటే ఇంకేం చేయాలి?” అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

Whats_app_banner