Odisha train accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే అధికారుల అరెస్ట్
Odisha train accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత నెల రెండవ తేదీన జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ ప్రమాదంలో 280 మంది వరకు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు.
Odisha train accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత నెల రెండవ తేదీన జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ ప్రమాదంలో 280 మంది వరకు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు.
ముగ్గురు అధికారుల అరెస్ట్
ముగ్గురు రైల్వే అధికారుల చర్యలు జూన్ 2న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి కారణమయ్యాయని సీబీఐ నిర్ధారించింది. ఆ ఆరోపణలపై సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మొహ్మద్ ఆమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్ 304, సెక్షన్ 201 తదితర చట్టాల కింద కేసు నమోదు చేసింది. అయితే, ఆ అధికారులు తీసుకున్న ఏ చర్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని సీబీఐ స్పష్టంగా తెలియజేయలేదు. వారి చర్యల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం పేర్కొందని ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.
రైల్వే సేఫ్టీ రిపోర్ట్
మూడు రోజుల క్రితం రైల్వే శాఖ అంతర్గత దర్యాప్తు విభాగమైన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (Commissioner of Railways Safety CRS) తమ నివేదికను సమర్పించింది. తప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థ ఈ ప్రమాదానికి కారణమని ఆ నివేదికలో పేర్కొంది. 2018 లో చేసిన ఒక మరమ్మత్తు సమయంలో సిగ్నలింగ్ సిస్టమ్ లో లోపం ఏర్పడిందని, మరో మరమ్మత్తు జూన్ 2వ తేదీన ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు చేశారని, ప్రస్తుత ప్రమాదానికి ఆ రెండు ప్రధాన కారణాలని తేల్చింది. వాటి కారణంగా, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు తప్పుడు సిగ్నల్ అందిందని పేర్కొంది. సిగ్నలింగ్ సిస్టమ్ లో తరచుగా ఏర్పడుతున్న సమస్యలను సకాలంలో గుర్తించి, పూర్తిగా పరిష్కరిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని సీబీఐ తెలిపింది.