Bengaluru rains: బెంగళూరులో కుండపోత వర్షం; ఉరుములు, మెరుపుల బీభత్సం
బెంగళూరు నగరాన్ని మంగళవారం వడగళ్లతో కూడిన కుండపోత వర్షం ముంచేసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన కుంభవృష్టి నగర వాసులను బెంబేలెత్తించింది. బెంగళూరు, ఆ పరిసర ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆకస్మిక కుంభవృష్టి కి బెంగళూరు నగర జన జీవనం అస్తవ్యస్తమైంది. మరో ఐదురోజుల పాటు నగరంలో ఇలాగే వడగళ్లతో కూడిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు ఉంటాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. భారీ వర్షం కారణంగా మంగళవారం బెంగళూరు లోని మల్లేశ్వరం, రాజాజీ నగర్, మైసూరు రోడ్, శ్రీరాం పురం, కెంగేరి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు నీట మునిగాయి.
మరికొన్ని రాష్ట్రాల్లోనూ..
కేరళ, లక్ష్యద్వీప్ లతో పాటు కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్లు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఇటీవలే బెంగళూరులో విధాన సౌధకు సమీపంలోని కేఆర్ సర్కిల్ ప్రాంతంలోని అండర్ పాస్ లో నీటిలో మునిగిన కారులో చిక్కుకుని ఒక యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సిబ్బంది, స్థానికుల సహకారంతో ఆ కారులోని మరో ఐదుగురిని ప్రాణాలతో కాపాడగలిగారు.
నైరుతి రుతు పవనాలు..
నైరుతి రుతు పవనాలు బంగాళాఖాతం నైరుతి ప్రాంతాల్లో ముందుకు వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ కు అవసరమైన వర్షపాతంలో సుమారు 70% ఈ నైరుతి రుతుపవనాల వల్లనే సమకూరుతుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కారణంగా అండమాన్ నికోబార్ ద్వీపాల్లో మే 19 నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ తరువాత రుతు పవనాల్లో మే 30 వరకు ఎలాంటి కదలిక చోటు చేసుకోలేదు.