Viral : ‘స్వీట్ రివేంజ్’- టీచర్‌కే క్లాస్ పీకిన విద్యార్థిని..!
ఇటీవలే 12వ తరగతి పాస్ అయిన విద్యార్థిని.. తన 10వ తరగతి టీచర్‌కు క్లాస్ పీకింది. ‘నువ్వు దేనికి పనికి రావు’ అని టీచర్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. ఓ మెసేజ్ చేసింది. అసలేం జరిగిందంటే..
చిన్నప్పుడు.. పిల్లలు చదువుకోకపోతే టీచర్లు వారిని మందలించడం సహజమే. కొంతమంది టీచర్లు కొడతారు కూడా! కొంతమంది.. ఇంకో అడుగు ముందుకేసి.. 'నువ్వు జీవితంలో పనికి రావు. నువ్వు ఏం సాధించలేవు,' అని క్లాస్ ముందు.. ఆ విద్యార్థిని తిట్టేస్తారు. ఈ మాటలను కొందరు విద్యార్థులు పట్టించుకోరు. మరికొందరు.. వాటిని పట్టుకుని, తమలో మార్పులు చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అయితే.. 'నువ్వు దేనికి పనికి రావు,' అన్న టీచర్‌కు ఓ విద్యార్థిని క్లాస్ పీకింది! పెద్ద మెసేజే పంపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆయిషా అనే విద్యార్థిని.. ఇటీవలే 12వ తరగతి పాస్ అయ్యింది. ఈ క్రమంలోనే తన 10వ తరగతి టీచర్‌కు మెసేజ్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసింది. అందులో ఏముదంటే..
"హల్లో ఆషా టీచర్. నేను మీ 2019-2020 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థిని. నేను ఏం సాధించలేనని మీరు అన్నారు. అసలు స్కూల్ కూడా పాస్ అవ్వలేనని అన్నారు. నా జీవితంలోని ప్రతి అడుగునూ మీరు కించపరిచారు. కానీ ఈరోజున.. నేను 12వ తరగతిలో మంచి మార్కులు సాధించాను. నాకు కావాల్సిన యూనివర్సిటీలో సీటు లభించింది. నాకు నచ్చిన కోర్సులోనే సీటు వచ్చింది. ఇది థాంక్యూ మెసేజ్ కాదు! నేను చేసి చూపించాను.. అని చెప్పడానికే మీకు మెసేజ్ చేశాను. ఇక నుంచైనా.. ఎవరైన విద్యార్థి సాయం కోసం వస్తే.. వారితో మంచిగా ప్రవర్తించండి," అని ఆయిషా.. తన టీచర్‌కు మెసేజ్ చేసింది.
రెండేళ్ల ముందే.. 10వ తరగతి పాసైనప్పుడే.. జీవితంలో ఏదైనా సాధించి.. టీచర్‌కు మెసేజ్ చేయాలని ఆయిషా ఫిక్స్ అయ్యింది.
ఆ మెసేజ్ చదివిన ఆ టీచర్.. 'నువ్వు పాస్ అవ్వడానికి నేనే కారణం' అని బదులిచ్చారు.
కాగా.. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయిషా చేసిన పనికి నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు.. అయిషా పనికి 'వావ్' అంటుంటే.. మరికొందరు 'ఎంత ఎత్తుకి ఎదిగినా.. టీచర్లతో అలా ప్రవర్తించకూడదు,' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఆ మెసేజ్‌లో.. ఆ విద్యార్థిని పడిన బాధ కనిపిస్తోంది,' అని ఇంకొందరు అంటున్నారు.
అయితే.. ఆ కామెంట్లలో.. దీపికా నారాయణ్ అనే మహిళ.. తన కు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.
"నేను 10వ తరగతి పాస్ అవ్వనని మా ప్రిన్సిపాల్.. మా నాన్నకి చెప్పారు. ఒకవేళ నేను పాస్ అయితే.. తన పేరు మార్చకుంటా అని అన్నారు. మా నాన్న కళ్లల్లో బాధను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా ఏడ్చేశాను. కానీ ఆ తర్వాత నేను మెరిట్లో పాస్ అయ్యాను. మా స్కూల్ బ్యాచ్ టాపర్స్‌లో నేను ఉన్నాను. 'పేరు మార్చుకుంటారా?' అని మా నాన్న అడిగారు," అని దీపికా నారాయణ్ చెప్పుకొచ్చారు.
ఇలా.. ఈ ట్వీట్ కింద.. అనేకమంది.. తమ టీచర్లతో జరిగిన విషయాలను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.
సంబంధిత కథనం