Eknat shinde: మెర్సిడెస్‌ను ఆటో వెనక్కి నెట్టేసిందన్న షిండే
ముంబై, జూలై 6: బ్రేకులు ఫెయిలైన ఆటో రిక్షా డ్రైవర్ అంటూ తనను ఎగతాళి చేసినందుకు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. ఆటోరిక్షాను నడిపిన తన గతాన్ని ప్రస్తావిస్తూ, ‘ఆటోరిక్షా మెర్సిడెస్‌ను వెనక్కి నెట్టేసింది..(మెర్సిడస్‌ను దాటి ముందుకు వెళ్లింది..)’ అని కౌంటర్ ఇచ్చారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇది తమ ప్రభుత్వమని భావించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
‘(ఆటో) రిక్షా మెర్సిడెస్‌ను వెనక్కి నెట్టింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఉంది. ఇది ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ ఇది నా ప్రభుత్వం అని భావించే విధంగా మేం పని చేస్తాం..’ అని షిండే చెప్పారు.
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మంగళవారం చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు షిండే స్పందించారు. బీజేపీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని త్రీవీలర్ ప్రభుత్వం అని పిలిచేదని, అయితే ఇప్పుడు త్రీవీలర్ నడిపిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని ఠాక్రే వ్యాఖ్యానించారు. షిండే తనను వెన్నుపోటు పొడిచారని కూడా ఠాక్రే ఆరోపించారు.
షిండే శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. చివరికి ఉద్ధవ్ ఠాక్రే జూన్ 29న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
‘అధికారం కోసం బిజెపి ఏదైనా చేస్తుందని చాలా మంది ఎదురుచూశారు. కానీ ఈ 50 మంది హిందుత్వ వైఖరిని, సైద్ధాంతిక వైఖరిని అవలంబించారని, వారి ఎజెండా అభివృద్ధి, హిందుత్వ అని, అందుకే వారికి మద్దతు ఇవ్వాలని వారు (బీజేపీ) దేశానికి చూపించారు. వారికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు మాకు మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి మాకు మద్దతు ఇచ్చారు..’ అని షిండే అన్నారు.
రాష్ట్రాన్నిఅభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ తనకు చెప్పారని షిండే చెప్పారు. అభివృద్ధి ప్రయత్నాలకు కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు.
‘ఇది చాలా పెద్ద విషయం. కేంద్రం కూడా మాతో ఉంది. మేం చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదు. ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం..’ అని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లు గెలుచుకుంటుందన్న వ్యాఖ్యలపై షిండేను ప్రశ్నించగా, 170 మంది ఎమ్మెల్యేలు కూటమితో ఉన్నారని, 200కు పైగా సీట్లు తెచ్చుకోగలమని అన్నారు.
భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ విశాల దృక్పథంతో ఉప ముఖ్యమంత్రి పదవికి సంసిద్ధత వ్యక్తంచేశారని, ఫడ్నవీస్‌కి ఇది అనూహ్యమని, అయితే తాను బీజేపీ ఆదేశాలను పాటించానని షిండే అన్నారు.
‘ఇది అతనికి ఊహించనిదే. కానీ అతను పార్టీ ఆదేశాలను అనుసరించారు. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే నా లాంటి కార్యకర్తను ముఖ్యమంత్రిని చేశారు, నేను ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి చీఫ్ జెపి నడ్డాకు ధన్యవాదాలు చెబుతున్నా..’ అని ఆయన అన్నారు.
మంత్రివర్గ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఎంవీఏ ప్రభుత్వంలో భాగం కావడం వల్ల పార్టీకి లాభం లేదని, దెబ్బతింటోందని శివసేన నాయకత్వానికి తాను చాలాసార్లు చెప్పానని షిండే చెప్పారు. శివసైనికులకు అన్యాయం జరిగిందని, ఎంసీవోసీఏ వంటి కఠినమైన చట్టాలను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు.
‘అధికారం ఉన్నప్పుడు శివసైనికులకు న్యాయం జరగాలి. వారు స్వావలంబనతో ఉండేందుకు వీలు కల్పించాలి. కానీ వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు. వారు నష్టాల పాలయ్యారు. అన్యాయానికి గురయ్యారు..’ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్, ఎన్‌సిపితో పొత్తు పెట్టుకోవాలన్న అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకునేందుకు తాము ప్రయత్నించామని, అయితే సఫలం కాలేదని షిండే చెప్పారు.