SSC MTS, CHSL exams: ఇక ఈ పరీక్షలను కూడా తెలుగులో రాసుకోవచ్చు..
SSC MTS, CHSL exams: ఉద్యోగార్ధులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఏటా లక్షలాది మంది రాసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ (SSC MTS) పరీక్షను ఇకపై తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో రాసేందుకు అనుమతించాలని నిర్ణయించారు.
SSC MTS, CHSL exams: సీఆర్పీఎఫ్ వంటి సాయుధ పోలీసు బలగాల (CAPF) ఎంపిక పరీక్షను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో రాసుకోవడానికి ఇటీవల కేంద్ర హోం శాఖ అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (SSC MTS) పరీక్షను, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (Combined Higher Secondary Level Examination - SSC CHSL) ను అభ్యర్థులు తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో రాసుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (Department of Personnel and Training) ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలను ఇప్పటివరకు హిందీ లేదా ఇంగ్లీష్ లో మాత్రమే రాసే వీలుండేది.
SSC MTS, CHSL exams: 13 ప్రాంతీయ భాషల్లో..
ఇకపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (SSC MTS) పరీక్షను, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL) ను అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్ లతో పాటు తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కూడా రాయవచ్చు. ఇకపై, ఆయా పరీక్షల ప్రశ్నా పత్రాలు ఈ ప్రాంతీయ భాషల్లోనూ ఉంటాయి. ఏ భాషలో పరీక్ష రాయాలని అనుకుంటున్నారో అభ్యర్థులు ముందే, అప్లై చేస్తున్న సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రం ఉండడం వల్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని లక్షలాది ఉద్యోగార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
టాపిక్