Monkeypox Cases: 8కి చేరిన మంకీపాక్స్ కేసులు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
Monkeypox cases: దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 8కి చేరడంతో కేంద్రం వాక్సిన్ అభివృద్ధి, టెస్టింగ్ కిట్‌ల అభివృద్ధి పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయని, రోగనిర్ధారణ కిట్లు, వ్యాక్సిన్‌ల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా మంగళవారం తెలిపారు.
ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, టెస్టింగ్ కిట్‌లు, వ్యాక్సిన్‌ల అభివృద్ధి కోసం తీసుకుంటున్న పలు చర్యల గురించి సభ్యులకు తెలియజేశారు.
ఇప్పటి వరకు భారతదేశంలో ఎనిమిది వ్యాధి కేసులు నమోదయ్యాయని, వాటిలో ఐదు కేసులు విదేశీ ప్రయాణ చరిత్ర కలిగి ఉన్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి తెలిపారు.
మంకీపాక్స్ వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి పరిశోధనా సంస్థల నుంచి, పరీక్ష నిర్ధారణ కిట్‌ల కోసం డయాగ్నొస్టిక్ కిట్‌ల తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కోరినట్టు తెలిపారు.
మరో అనుబంధ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ‘మంకీపాక్స్ వ్యాధి నియంత్రణకు వీలుగా డయాగ్నస్టిక్స్, వ్యాక్సిన్ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి మంకీపాక్స్ వ్యాధిపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం..’ అని తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణీకుల రాక సందర్భంగా కఠినమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
అనుమానిత కేసులను పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని రిఫరల్ లాబొరేటరీగా నియమించినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 15 ఇతర వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీల్లో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేపట్టేందుకు వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
భారతదేశంలో మొదటి కేసు జూలై 14న కేరళలో నమోదవగా, మే 1, 2022న కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చిందని మంత్రి తెలిపారు.
జూలై 27, 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల నుండి 18,000 మంకీపాక్స్ కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిందని మాండవీయా చెప్పారు.
టాపిక్