DA hike: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త; త్వరలో 4 శాతం డీఏ పెంపు!-7th pay commission government employees likely to get 4 percent da hike in march 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Da Hike: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త; త్వరలో 4 శాతం డీఏ పెంపు!

DA hike: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త; త్వరలో 4 శాతం డీఏ పెంపు!

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 06:43 PM IST

DA hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (DA) 4% పెరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో అంటే 2024 మార్చిలో నాలుగు శాతం కరువు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం లెక్కిస్తారు.

ఏడవ పే కమిషన్

7వ కేంద్ర వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారమే ఈ డీఏ పెంపు ఉంటుంది. 2023 అక్టోబర్లో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ను, పెన్షనర్లకు డీఆర్ ను నాలుగు శాతం పెంచారు. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్ లను ప్రభుత్వం ఆమోదించింది. 2022-2023 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్ హాక్ బోనస్) లెక్కింపునకు రూ.7,000 పరిమితిని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది.

పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు బొనాంజా

దేశ ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా డీఏ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డీఏను మరింత పెంచే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరానికి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) 12 నెలల సగటు పెరుగుదల శాతాన్ని బట్టి డీఏ, డీఆర్ పెంపును నిర్ణయిస్తారు. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2023 డిసెంబర్లో తమ ప్రభుత్వం తన ఉద్యోగులందరికీ కొత్త సంవత్సరం రోజు నుండి నాలుగు శాతం డీఏ పెంచనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది, అన్ని చట్టబద్ధమైన సంస్థలు, పారాస్టాటల్స్, పెన్షనర్లకు 2024 జనవరి 1 నుంచి మరో విడత 4 శాతం డీఏ లభిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. డీఏ నిబంధన కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి అయితే రాష్ట్రానికి ఐచ్ఛికమని, డీఏ పెంపునకు తమ ప్రభుత్వం రూ.2,400 కోట్ల అదనపు వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని మమతా బెనర్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో అలవెన్సులను సవరిస్తున్నప్పటికీ, సాధారణంగా మార్చి, సెప్టెంబర్ నెలల్లో డీఏ పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

Whats_app_banner