Morning Routine To Wake Up Brain । ఉదయం పూట ఈ పనులు చేస్తే మీ మెదడు చురుకవుతుంది!
Ways to Brain Wake Up Your Brain: ఉదయం పూట అంతా గందరగోళంగా ఉంటుంది. హడావిడిగా పనులు చేసుకోవాల్సి వస్తుంది. మైండ్ సరిగా పనిచేయదు. అయితే దీనిని పరిష్కారం ఉంది. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే ఉదయం మీ మైండ్ చురుకుగా పనిచేస్తుంది.
వీకెండ్ అయిపోగానే ఉరుకులు పరుగుల జీవితం మళ్లీ మొదలవుతుంది. పొద్దున లేచిన దగ్గర్నించీ శుభ్రత పనులు చూసుకోవడం, బట్టలు వెతుక్కోవటం, బ్రేక్‌ఫాస్ట్ చేయటం, హడావిడిగా కార్, బైక్ కీలు వెతుక్కోవడం ఇలా ప్రతీది ఒక్కో టాస్కులా ఉంటుంది. ఎంత త్వరగా చేద్దామనుకున్నా సమయం మించిపోతూ ఉంటుంది. ఈ హడావిడిలో మన మెదడు కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఇదొక డైలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇందులో మార్పు రావాలంటే మీరు ప్రశాంతంగా ఆలోచించగలగాలి. అప్పుడు అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉదయం పూట ఎలాంటి హడావిడి ఉండదు.
Ways to Brain Wake Up Your Brain:
అయితే ఇందుకోసం ఉదయం 4 గంటలకే నిద్రలేవాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీ రోజూవారీ దినచర్యను సర్దుబాటు చేసుకోవచ్చు. మీ మెదడును చురుకుగా పనిచేసేలా చేయవచ్చు అంటున్నారు న్యూరో సైన్స్ నిపుణులు. ఈ చిట్కాలు కఠినమైనవేమి కాదు, చాలా తేలికైన చిట్కాలు. అవేంటో చూడండి.
నీరు త్రాగండి
రాత్రంతా నిద్రపోయిన తర్వాత మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. మన శరీరంలో 60 శాతం వరకు నీరు ఉంటుంది. మీ మెదడులోని కణాలలో ఎక్కువగా ఉండేది నీరే. వ్యర్థాలను బయటకు పంపడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, కణాల పెరుగుదల, మనుగడకు సహాయం చేయడంతో పాటు మెదడు చేసే ప్రతి పనికి నీరు అవసరం అవుతుంది. న్యూరోట్రాన్స్మిటర్లు, హార్మోన్లను తయారు చేయడం వంటి పనులకు కూడా మెదడుకు నీరు అవసరం. అందువల్ల మీ కడుపులో ట్యాంక్ నీటితో నింపకపోతే డీహైడ్రేషన్ తద్వారా జ్ఞాపకశక్తి మందగించడం, మతిమరుపు, ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల ఉదయం లేచిన వెంటనే ఒక 2-3 గ్లాసుల నీరు తాగేయండి. దీంతో ఉదయం మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది.
హుషారైన సంగీతం వినండి
మంచి ఊపున్న సంగీతం వింటే మెదడు తరంగాలు కొంతవరకు సమకాలీకరించబడతాయి. అంటే ఉల్లాసమైన ట్రాక్‌లు మెదడును మరింత చురుకైన స్థితికి తరలించడంలో సహాయపడతాయి. ఎలాంటి జానర్ మ్యూజిక్ అయినా పర్వాలేదు. కాకపోతే స్లో మ్యూజిక్, విషాదగీతాలు ఎంచుకోవద్దు. మ్యూజిక్ ట్రాక్‌లో వేగం ఉండాలి. ఉదయం పూట వినే హుషారైన మ్యూజిక్ మీ మైండ్‌ని ఓపెన్ చేస్తుంది, మీ మూడ్ సెట్ చేస్తుంది.
కాంతి పొందండి
మీ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడంలో కాంతి చాలా కీలకం. ఈ కాంతి మీ కళ్ళను తాకినప్పుడు, అది మీ రెటీనా మెదడును కలిపే నరాల మార్గాన్ని ప్రేరేపిస్తుంది. అక్కడ నుంచి మీ శరీర ఉష్ణోగ్రత, హార్మోన్లు, మిమ్మల్ని మేల్కొలిపే ఇతర కారకాలతో మెదడు సమన్వయం చేసుకుంటుంది. కాబట్టి ఉదయం లేవగానే సూర్యోదయం చూడటం, సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. కొన్ని సమయాలో తగినంత సూర్యకాంతి ఉండకపోతే మీరు మంచం నుండి లేవడానికి ముందు మీ గదిని ప్రకాశవంతం చేయడం కోసం లైట్ వేసుకోవటం, లైటింగ్ అలారం పెట్టుకోడం చేయవచ్చు. ఉదయం లైట్ తగిలినపుడు మీ మైండ్ యాక్టివ్ అవుతుంది.
తేలికపాటి వ్యాయామం
ఉదయం పూట కసరత్తులతో బాగా కష్టపడి, చెమటోడ్చాల్సిన అవసరం లేదు. మెదడు చురుకుగా ఉండాలంటే కొద్దిగా వ్యాయామం చేయాలు. తేలికపాటి వ్యాయామం మెదడుకు సాధారణ ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడుకు అందే ఆక్సిజన్, పోషకాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. కాబట్టి కొన్ని జంపింగ్ జాక్‌లు చేయండి, త్వరితగతిన నడవండి లేదా మీకు ఇష్టమైన వర్కౌట్ ఏదైనా చేయవచ్చు.
చన్నీటి స్నానం చేయండి
ఉదయం పూట చల్లటి షవర్ కింద నిలబడటం వలన మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడం, న్యూరోట్రాన్స్‌మిటర్‌లను పెంచడం, మీ శ్వాసక్రియను పెంచడం వంటి అనేక జీవ ప్రక్రియలను ప్రేరేపిస్తుంది. ఇవి మీకు చిన్నపాటి శక్తిని అందిస్తాయి, మిమ్మల్ని మంచి మానసిక స్థితికి కూడా చేర్చగలవు. కాబట్టి ఉదయం పూట వేడివేడి నీళ్లతో కాకుండా చల్లటి నీటితో స్నానం చేయండి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే గోరు వెచ్చని నీటితో చేయాలి.
సంబంధిత కథనం