Fruit Before Bed: హాయిగా నిద్ర పట్టాలా.. పడుకోబోయే ముందు ఈ పండు తినండి చాలు..-know benefits of eating banana before going to bed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruit Before Bed: హాయిగా నిద్ర పట్టాలా.. పడుకోబోయే ముందు ఈ పండు తినండి చాలు..

Fruit Before Bed: హాయిగా నిద్ర పట్టాలా.. పడుకోబోయే ముందు ఈ పండు తినండి చాలు..

Koutik Pranaya Sree HT Telugu
Dec 24, 2023 08:01 PM IST

Fruit Before Bed: నిద్ర పోయే ముందు అరటిపండు తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. దాంతో పాటే బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూడండి.

మంచి నిద్రకోసం అరటిపండు
మంచి నిద్రకోసం అరటిపండు (freepik)

చాలా మంది నిద్ర లేమి సమస్యలతో చెప్పలేనన్ని ఇబ్బందులు పడుతుంటారు. పడక మీద వాలి పడుకున్నా గంటలు గంటలు అలా గడవాల్సిందే తప్ప.. కంటి మీదకు కునుకు రాదు. ఇలాంటి వారికి ఉదయం లేచిన తర్వాత చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏం పని చేయాలన్నా విసుగు వస్తుంది. ఇక ఇదే నిద్ర లేమి కొన్ని రోజుల పాటు కొనసాగితే దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందుకనే నిద్ర పోయే ముందు ఓ పండును తినమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు కొన్ని పనులు చేయడం వల్ల నిద్ర మంచిగా పట్టే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అవేంటో తెలుసుకోండి..

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పండిన అరటి పండును తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అరటి పండులో నిద్రను మెరుగుపరిచే రకరకాల పోషకాలు ఉంటాయి. దీంతో ఇది చక్కగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. దీనిలో ట్రిప్టోఫాన్ అనే అమీనో యాసిడ్‌ ఉంటుంది. ఇది మనలో నిద్ర హార్మోన్‌ అయిన సెరటోనిన్‌ విడుదల కావడాన్ని ప్రోత్సహిస్తుంది.

అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మనలో కండరాలకు సాంత్వన కలిగిస్తాయి. సాధారణంగా మనకు మజిల్‌ టెంక్షన్స్‌ ఉన్నా కూడా అది నిద్ర లేమికి కారణం అవుతుంది. నిద్ర నాణ్యత తీవ్రంగా దెబ్బ తింటుంది. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియంలు రెండూ కలిసి ఉండటం వల్ల ఒత్తిడి తేలికగా తగ్గుతుంది. మనకు ప్రశాంతత కలిగినట్లుగా అనిపిస్తుంది. దీని వల్ల తేలికగా నిద్రలోకి జారుకునే అవకాశాలు పెరుగుతాయి.

ఈ పండులో మనకు అవసరం అయిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో సహజమైన చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిల్ని రాత్రి సమయంలో నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తాయి. కొన్ని సార్లు మనం నిద్ర పోయిన తర్వాత ఒక్కసారే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఆ తర్వాత వెంటనే బాగా ఆకలి కావడం ప్రారంభం అవుతుంది. అందువల్ల మనం నిద్ర మధ్యలో మేల్కొంటాం. అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అరటి పండు తిని పడుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి.

కాబట్టి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తిని పడుకోవడం అలవాటుగా చేసుకోండి. అలాగే చామంతి టీ తాగడం, మంచి సంగీతం వినడం, సెంటెడ్‌ క్యాండిల్స్‌ వెలిగించుకోవడం లాంటివన్నీ మీరు నిద్రపోవడానికి సహకరిస్తాయని గుర్తుంచుకోండి.

WhatsApp channel