Morning Drink | ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకండి.. ఏం తాగాలో తెలుసుకోండి!
Morning Drink: చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగటం అలవాటు ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగొద్దని, బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
Morning Drink: చాలా మంది ప్రజలు ఉదయం ఒక కప్పు టీతో తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఉదయాన్నే టీ తాగటం వలన ఉత్తేజం, శక్తి లభిస్తాయి. చురుకుగా పనిచేసుకోగలుగుతాం. ఎందుకంటే టీలో కెఫీన్ (Caffeine) అనేది ఉంటుంది. ఇది మన శరీరంలో ఒక ఉద్దీపనలా పనిచేస్తుంది. అయితే టీ తాగడానికి కొన్ని నియామాలు పాటించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయానే ఖాళీ కడుపుతో టీ తాగడం శ్రేయస్కరం కాదని వారు సూచిస్తున్నారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా మరేదైనా కెఫిన్ ఉన్న పానీయం తాగడం వల్ల ఎసిడిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది కడుపులో చికాకు, కడుపు ఉబ్బరంకు కారణమవుతుంది.మీరు ఉదయాన్నే లేదా తరచుగా ఇలాంటి అసౌకర్యాన్ని అనుభవిస్తుంటే ఖాళీ కడుపుతో ఈ రకమైన పానీయాలు తీసుకొని ఉండవచ్చు.
అదనంగా టీ (Tea) ఒక మూత్రవిసర్జక కారకం అంటే, ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది, రోజులో అతిగా టీ తాగడం వలన మీరు నిర్జలీకరణానికి కూడా గురవుతారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ తాగటం వలన కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. ఎందుకంటే మీరు రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు ఏమి తినకుండా, తాగకుండా ఉంటారు. ఈ సమయంలో మీ శరీరంలోని నీరు, పోషకాలు ఖర్చు అయిపోతాయి. తర్వాత ఉదయం లేవగానే మీరు తీసుకునేది టీ లేదా కాఫీ అయితే మీ శరీరాన్ని మరింత అసౌకర్యానికి గురిచేసినట్లే.
టీ టానిన్‌లను కూడా కలిగి ఉంటుంది, ఇవి ఇనుము, కాల్షియం వంటి పోషకాలను బంధించగలవు. అప్పుడు శరీరం వీటిని శోషించుకోలేదు, పలు శరీర విధుల్లో అంతరాయం కలగవచ్చు.
టీలో సహజ ఆమ్లాలు ఉంటాయి, మీరు చాలా కాలంగా ఎక్కువ మొత్తంలో టీ తాగడం ద్వారా ఇవి దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తాయి. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు లేదా ముందుగా ఉన్న యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. జీవక్రియ ప్రక్రియ మందగిస్తుంది, ఇది గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయాలి. నివేదికల ప్రకారం, ఖాళీ కడుపుతో టీ తాగడం వలన గర్భిణీ స్త్రీలకు అలాగే వారి పుట్టబోయే బిడ్డకు హానికరం.
Drink on Empty Stomach- ఖాళీ కడుపుతో ఎలాంటివి తాగాలి?
రాత్రి నిద్ర పోయి ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సిస్టమ్‌ను రీసెట్ చేయడానికి ముందుగా ఒక గ్లాసు నీరు తాగండి. లేదా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం నిమ్మకాయ నీరు, మెంతి నీరు తీసుకోవచ్చు. అలాగే కలబంద రసం, కొబ్బరి నీరు, తేనె, నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగవచ్చు. ఈ పానీయాలు చాలా ఆరోగ్యకరమైనవి, ఉదయం పూట తాగే వేడి కప్పు టీ కంటే మేలైనవి.
సంబంధిత కథనం