IND vs WI: “నిద్ర లేదు”: ఇబ్బందులు పడిన టీమిండియా ప్లేయర్లు!: బీసీసీఐకి లేఖ
IND vs WI: వెస్టిండీస్‍తో వన్డే సిరీస్‍కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఇబ్బంది ఎదురైందని తెలుస్తోంది. నిద్ర లేక చిరాకు పడ్డారని సమాచారం.

IND vs WI: వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో టెస్టు చివరి రోజు మొత్తం వర్షం కారణంగా రద్దవటంతో మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 1-0తో టెస్టు సిరీస్‍ను చేజిక్కించుకుంది. తదుపరి విండీస్ టూర్‌లో మూడు వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు. రేపు (జూలై 27) బార్బడోస్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే, వన్డే సిరీస్‍కు ముందు టీమిండియా ప్లేయర్లకు విసుగు చెందే విషయం జరిగిందని సమాచారం. దీంతో సరైన నిద్ర కూడా లేక ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..
తొలి వన్డే కోసం ట్రినిడాడ్ నుంచి బార్బొడాస్‍కు సోమవారం బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు.. విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని రిపోర్టులు బయటికి వచ్చాయి. అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు రావాల్సిన విమానం.. ఏకంగా నాలుగు గంటలు ఆలస్యంగా తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిందట. దీంతో భారత ప్లేయర్లు తీవ్ర అసహనానికి లోనయ్యారని, సరైన నిద్ర లేక ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. రెండో టెస్టు, మొదటి వన్డే మధ్య ఎక్కువ రోజుల సమయం లేకపోవటంతో ఇది ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై బీసీసీఐకి టీమ్ మేనేజ్‍మెంట్ లేఖరాసినట్టు తెలుస్తోంది.
వెస్టిండీస్‍తో టీమిండియా రెండో టెస్టు సోమవారం ముగియగా.. మళ్లీ గురువారమే తొలి వన్డే ఆడాల్సి ఉంది. ఈ మధ్యలో విమానం ఆలస్యంతో ఒక రోజంతా ఆటగాళ్లకు నిద్ర లేకపోయే సరికి ఇబ్బందిగా మారింది. దీంతో ఇప్పటి నుంచి ఆటగాళ్లకు రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దని, డే టైమ్‍లోనే ప్లాన్ చేయాలని బీసీసీఐకి టీమ్ మేనేజ్‍మెంట్ లేఖ రాసిందని సమాచారం.
“వాళ్లు (టీమిండియా ప్లేయర్లు) హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు రాత్రి 8.40 గంటలకు బయలుదేరారు. అయితే, విమానాశ్రయంలో చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. లేట్ నైట్ విమానాలు కాకుండా.. ఉదయం పూట విమానాలను ఆటగాళ్ల కోసం బుక్ చేయాలని టీమ్ మేనేజ్‍మెంట్ అభ్యర్థించింది. ఇలా అయితే మ్యాచ్ తర్వాత రెస్ట్ తీసుకునేందుకు ప్లేయర్లకు కాస్త సమయం దొరుకుతుందని తెలిపింది. బీసీసీఐ దీనికి అంగీకరించింది. తర్వాతి షెడ్యూల్‍ను అలానే ప్లాన్ చేస్తుంది” అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు ఆ రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈ సిరీస్‍లో ఇండియా, వెస్టిండీస్ మధ్య మొదటి రెండు వన్డేలు బార్బడోస్‍లో జరగనుండగా.. చివరి మ్యాచ్ ట్రినిడాడ్‍లో జరుగుతుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‍ల టీ20 సిరీస్ ఉంటుంది.
ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో విండీస్‍తో వన్డే సిరీస్‍లో ప్రయోగాలు చేయాలని టీమిండియా భావిస్తోంది. సంజూ శాంసన్, ఉమ్రన్ మాలిక్ సహా మరికొందరు ఆటగాళ్లను పరీక్షించనుంది.
సంబంధిత కథనం