Tollywood | సినీ గేయరచయిత కందికొండ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం
టాలీవుడ్ సినీ గేయరచయిత కందికొండ శనివారం నాడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. ఆయన రాసిన పాటల్లో మళ్లీ కూయవే గువ్వ ,పోకిరిలో గల గల పారుతున్న గోదారిలా లాంటి సాంగ్స్ మంచి విజయవంతమయ్యాయి.
చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఇటీవలే సిరివెన్నెల సీతారామశాస్త్రీ మృతి చెందగా.. తాజాగా మరో రచయితను కోల్పోయింది. ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ హైదరాబాద్‌లో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం నాడు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉంటున్న ఆయన తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జన్మించిన ఈయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై ఆసక్తితో క్రమంగా సినీరంగ వైపు అడుగులు వేశారు.
గువ్వ మూగపోయింది.. మళ్లీ కూయనంది..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో 'మళ్లీ కూయవే గువ్వ' పాటతో ఆయన గేయ రచయితగా టాలీవుడ్‍కు పరిచయమయ్యారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ నుంచి చిత్ర సీమంలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇడియట్‌లో చూపుల్తో గుచ్చి గుచ్చి.. సత్యంలో మధురమే మధురమే, ఐయామ్ ఇన్ లవ్, పోకిరిలో గల గల పారుతున్న గోదారిలా, జగడమే, మస్కాలో కల్లోకి దిల్లోకి అనే పాటతో సహా ఆరు పాటలు రాశారు. చివరగా 2018లో వచ్చిన నీది నాది ఒకటే కథ చిత్రంలో ఓ పాట రాశారు. ఎక్కువగా పూరీ జగన్నాథ్, దివంగత సంగీత దర్శకడు చక్రి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో పాటలు రాశారు.
గత కొన్నిరోజులుగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కందికొండ ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కుటుంబం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. మళ్లీ విషమించడంతో శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతి పట్ల చిత్ర సీమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి గేయ రచయితను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
కందికొండ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతి కి సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించారని అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు.
కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడం దురదృష్టమని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్