Rashmika Mandanna: తమన్నా, త్రిష, పూజాహెగ్డే ఫెయిలయ్యారు - రష్మిక, నయనతార బాలీవుడ్‌ను ఊపేశారు
Rashmika Mandanna: దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్‌లో హిట్ కొట్టలేరనే అపవాదును రష్మిక మందన్న, నయనతార చెరిపివేశారు. 2023లో నయనతార జవాన్, రష్మిక మందన్న యానిమల్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి.
Rashmika Mandanna: బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని, హిట్టు అందుకోవాలని దక్షిణాది హీరోయిన్లు కలలు కంటుంటారు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లుగా రాణించిన చాలా మంది అందాల ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్నీ పరీక్షించుకున్నారు. కానీ అందులో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పెద్దగా విజయాల్ని అందుకోలేకపోయారు.
దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్‌లో రాణించలేరనే ముద్రబలంగా పడిపోయింది. కాజల్ అగర్వాల్, త్రిష, రకుల్ ప్రీత్ సింగ్, పూజాహెగ్డేలు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్లుగా కొనసాగారు. తెలుగులో బిజీగా ఉన్న తరుణంలోనే బాలీవుడ్‌వైపు అడుగులువేశారు. కానీ అక్కడ వారికి నిరాశే మిగిలింది. మెహంజదారో నుంచి ఈ ఏడాది విడుదలైన కిసీ కా భాయ్ కిసీ జాన్ వరకు పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీస్ మొత్తం డిజాస్టర్స్‌గా మిగిలాయి.
హిమ్మత్‌వాలా, హమ్‌షకల్స్‌తో పాటు బాలీవుడ్‌లో తమన్నా పదికిపైగా సినిమాలు చేసినా ఇప్పటివరకు హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దక్షిణాదిలో బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోయిన కాజల్ హిందీలో మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితమైంది. రకుల్ పరిస్థితి బాలీవుడ్‌లో అంతంత మాత్రంగానే ఉంది. బాలీవుడ్‌లో దక్షిణాది హీరోయిన్లు రాణించలేరనే ఆపవాదును ఈ ఏడాది రష్మిక, నయనతార తుడిచేశారు.
జవాన్‌తో నయనతార, యానిమల్‌తో రష్మిక బాలీవుడ్‌ను ఊపేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో దక్షిణాది హీరోయిన్లు నటించిన సినిమాలే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి కాసుల వర్షం కురిపిస్తోన్నాయి.
జవాన్‌తో నయన్ ఎంట్రీ...
జవాన్‌తోనే నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల వసూళ్లను రాబట్టింది. తొలి అడుగులోనే బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నది నయనతార
యానిమల్‌తో రష్మిక హవా
యానిమల్‌తో తన కెరీర్‌లోనే పెద్ద సక్సెస్‌ను అందుకున్నది రష్మిక మందన్న. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వారం రోజుల్లోనే దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులను తిరగరాసింది.
యానిమల్ విడుదలై వారం దాటినా కలెక్షన్ల జోరు తగ్గలేదు. గుడ్‌బైతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక... యానిమల్‌తో ఫస్ట్ సక్సెస్‌ను అందుకున్నది. యానిమల్ కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.