Sandeep Reddy Vanga Animal Earnings: యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ సంపాదన ఎంతో తెలుసా?
Sandeep Reddy Vanga Animal Earnings: యానిమల్ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సంపాదించిన మొత్తం ఎంత? ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అవడంతో అందుకు తగినట్లే సందీప్ కూడా భారీగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
Sandeep Reddy Vanga Animal Earnings: యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిపోయాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సినిమా అంటే ఇలాగే తీయాలన్న కట్టుబాట్లు ఏమీ లేకుండా చాలా బోల్డ్ గా యానిమల్ తెరకెక్కించి విమర్శలతోపాటు ప్రశంసలు కూడా అందుకుంటున్న ఈ డైరెక్టర్.. యానిమల్ ద్వారా భారీగా సంపాదన కూడా మూటగట్టుకున్నాడు.
ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి కేవలం రూ.1.5 కోట్ల కోసం 36 ఎకరాల మామిడి తోట అమ్ముకున్న ఇదే సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు యానిమల్ ద్వారా రూ.200 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. యానిమల్ మూవీ సందీప్ డైరెక్టర్ కాగా.. అతని సొంత ప్రొడక్షన్ భద్రకాళీ పిక్చర్స్.. టీ-సిరీస్ తో కలిసి సినిమాను తెరకెక్కించింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కురుస్తున్న వందల కోట్లలో సందీప్ రెడ్డి జేబులోకి కూడా భారీగానే వెళ్తోంది.
అప్పుడు భూమి అమ్ముకొని.. ఇప్పుడు కోట్లు కొల్లగొట్టి..
ధైర్యంగా అడుగు ముందుకేసిన వాళ్లనే అదృష్టం కూడా వరిస్తుందని అంటారు. దీనికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అసలుసిసలు నిదర్శనం అని చెప్పొచ్చు. అతని తొలి సినిమా అర్జున్ రెడ్డి తీయడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తమ పూర్వీకుల భూమి అమ్మాల్సి వచ్చిందని గతంలో ఓసారి అతడే చెప్పాడు. ఆ సినిమా కోసం తన దగ్గర రూ.1.5 కోట్లు ఉన్నాయని, అయితే మిగతా మొత్తం కోసం పలువురు ముందుకు వచ్చినా చివరి నిమిషంలో వెనుకడుగు వేశారని సందీప్ వెల్లడించాడు.
షూటింగ్ కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ మరో రూ.1.6 కోట్ల కోసం తన తండ్రి, సోదరుడు 36 ఎకరాల మామిడి తోట అమ్మినట్లు గతంలో సందీప్ చెప్పాడు. అంత రిస్క్ తీసుకొని అర్జున్ రెడ్డి చేయడం, ఆ సినిమా హిట్ కావడం, దానిని మళ్లీ కబీర్ సింగ్ గా హిందీలోనూ తెరకెక్కించి సక్సెస్ కావడంతో సందీప్ ఇక వెనుదిరిగి చూడలేదు.
ఇప్పుడు యానిమల్ మూవీని కూడా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో టీ సిరీస్ తోపాటు సందీప్ సొంత ప్రొడక్షన్ హౌజ్ భద్రకాళీ పిక్చర్స్ కూడా ఉంది. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.660 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ లాభాలు, డైరెక్టర్ గా సందీప్ రెమ్యునరేషన్ అంతా కలుపుకుంటే ఇప్పటికే అతడు, అతని సోదరు ప్రణయ్ రెడ్డి ఈ సినిమా ద్వారా రూ.200 కోట్ల వరకూ సంపాదించినట్లు సమాచారం.
ఇది ఒక రకంగా జాక్ పాట్ అని చెప్పాలి. ఒకే సినిమాతో ఇంత భారీ మొత్తం సంపాదించడమంటే మాటలు కాదు. యానిమల్ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ఆ లెక్కన ఈ అన్నాదమ్ములు మరింత భారీగా సంపాదించడం ఖాయం. అంతేకాదు యానిమల్ తో టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిన సందీప్ భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేయడం కూడా ఖాయమే. దీంతో దేశంలో అతి భారీ మొత్తాలు అందుకునే ఫిల్మ్ మేకర్స్ లో ఒకడిగా సందీప్ నిలబోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.