Ram Setu movie review: రామ్ సేతు మూవీ అక్షయ్ కుమార్‌కు హిట్ ఇచ్చినట్లేనా?
Ram Setu movie review: రామ్ సేతు మూవీ మంగళవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా హిట్ ఇచ్చినట్లేనా? అసలు రామ్ సేతు ఎలా ఉంది?
Ram Setu movie review: రామ్ సేతు.. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే వానరసేనతో కలిసి లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి నిర్మించాడని చెబుతున్న ఓ మహాద్భుత కట్టడం. హిందూ మహాసముద్రంలో ఇండియా, ఇప్పటి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధిపై ఎన్నాళ్లుగానో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ కట్టడం నిజమేనా? రాముడే నిర్మించాడా? ఇదంతా కల్పితమా? అన్న అంశంపై వాదోపవదాలు నడుస్తూనే ఉన్నాయి.
అలాంటి చారిత్రక అంశాన్నే ప్రధాన కథాంశంగా చేసుకొని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మూవీ రామ్ సేతు. మంగళవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అక్షయ్ కుమార్ సాహస యాత్ర సక్సెస్ అయినట్లేనా? అతని ఖాతాలో ఓ హిట్ పడిందా?
రామ్ సేతు కథ ఏంటి?
రామ్ సేతు మూవీ డాక్టర్ ఆర్యన్ కుల్‌శ్రేష్ఠ్ (అక్షయ్‌కుమార్) అనే ఓ ఆర్కియాలజిస్ట్ చుట్టూ తిరిగే కథ. ఇంద్రకాంత్ (నాజర్) అనే వ్యక్తి సేతుసముద్రం పేరుతో ఓ ప్రాజెక్ట్‌కు పూనుకుంటాడు. దానికి రామసేతు అడ్డుగా వస్తుంది. ఈ క్రమంలో రామసేతు ఓ సహజ నిర్మాణమని, మానవ నిర్మిత కట్టడం కాదని నిరూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఇది మానవ నిర్మిత కట్టడం కాదని బలంగా విశ్వసించే, నాస్తికుడైన ఆర్యన్ కుల్‌శ్రేష్ఠ్‌కి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. వాల్మీకి రామాయణంలో రాముడే వానరసేనతో కలిసి నిర్మించినట్లుగా చెబుతున్న రామ సేతు అనే కట్టడం నిజానికి అసలు లేనే లేదని నిరూపించడానికి అతడు బయలుదేరుతాడు. కానీ ఈ క్రమంలో ఆ కట్టడం నిజమే అని, ఓ మనిషే దానిని నిర్మించాడని, చరిత్రలో రాముడి ఉనికి ఉన్నదని డాక్టర్ ఆర్యన్ గుర్తిస్తాడు.
రామసేతు నిర్మాణంతోపాటు రావణుడి లంకను ఆర్యన్ ఎలా గుర్తిస్తాడు? ఈ ప్రాజెక్ట్‌లో ఆర్యన్‌కు పర్యావరణవేత్త డాక్టర్ సాండ్రా (జాక్వెలిన్ ఫెర్నాండెజ్), శ్రీలంకలోని గైడ్ ఏపీ (సత్య దేవ్) ఎలా సహకరిస్తారు? ఈ క్రమంలో ఆర్యన్‌కు ఎదురైన అడ్డంకులు ఏవి అన్నది రామ్ సేతు సినిమాలో చూడొచ్చు.
రామ్ సేతు ఎలా ఉంది?
రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. ఇలాంటి కథను సరిగ్గా తెరకెక్కిస్తే ఎలాంటి ప్రేక్షకులనైనా కట్టి పడేస్తుంది. ఆ విషయంలో రామ్ సేతు మేకర్స్ ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అదేదో సినిమా డైలాగ్‌లాగా ఈ రామ్ సేతు మూవీని పార్ట్‌లు పార్ట్‌లుగా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మాత్రం ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఇవ్వాల్సిన్ కిక్ మాత్రం ఇవ్వదు.
స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, నాసిరకమైన వీఎఫ్‌ఎక్స్, కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజరీ (సీజీఐ) ఎంతో బలమైన సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ మూవీని బలహీనంగా మార్చేశాయి. కోట్లాది మంది విశ్వాసాలతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్‌ను మేకర్స్ ఒకరకంగా నీరుగార్చారు. కొన్నిసార్లు ఓ కార్టూన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
అయితే హిందూ మహాసముద్ర గర్భంలో ఉన్న రామసేతును ఆకట్టుకునేలా చిత్రీకరించడంలో డైరెక్టర్ అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యాడు. దీంతోపాటు కొన్ని అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ సేతు వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను డాక్టర్ ఆర్యన్ అండ్ టీమ్ వెతికే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా మొత్తంలో అక్షయ్ పాత్రను బలంగా చూపించినా.. మిగతా పాత్రలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏపీ పాత్రలో సత్యదేవ్ నటన చాలా బాగుంది. అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన డైలాగులు, హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
రామ్ సేతు ట్రైలర్ మొత్తం అడ్వెంచర్, యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసినా.. మూవీ మాత్రం ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నది చివరికి అర్థమే కాదు. ఆ రకంగా చూస్తే అక్షయ్‌కు మరో నిరాశ తప్పేలా లేదు.
టాపిక్