Puli Meka Web Series Review: పులి మేక వెబ్ సిరీస్ రివ్యూ - లావణ్య త్రిపాఠి సైకో కిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే
Puli Meka Web Series Review: ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పులిమేక వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైకో కిల్లర్ కథతో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందంటే...
Puli Meka Web Series Review టాలీవుడ్ హీరోహీరోయిన్లు ఆదిసాయికుమార్(Aadi sai kumar), లావణ్యత్రిపాఠి (Lavanya Tripathi)డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన వెబ్‌సిరీస్ పులిమేక. కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌కు కోన వెంకట్ కథను అందిస్తూ స్వయంగా నిర్మించారు. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో శుక్రవారం (నేడు)రిలీజైంది. ఈ సిరీస్ ఎలా ఉంది? ఆదిసాయికుమార్, లావణ్య త్రిపాఠి తొలి ఓటీటీ ప్రయత్నం ప్రేక్షకుల్నిమెప్పించిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
సైకో కిల్లర్ కథ…
హైదరాబాద్ నగరంలో ఓ సైకో కిల్లర్ పోలీస్ ఆఫీసర్స్‌ను టార్గెట్ చేస్తాడు. నెల రోజుల్లోనే ముగ్గురిని హత్యచేస్తాడు ఈ సైకో కిల్లర్ కేసును కమీషనర్ అనురాగ్ నారాయణన్(సుమన్) ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ఫ్రభ(లావణ్య త్రిపాఠి)కు అప్పగిస్తాడు. కిరణ్ ప్రభ టీమ్‌లోనే ఫోరెన్సిక్ హెడ్‌గా ప్రభాకరశర్మ(ఆది సాయికుమార్) పనిచేస్తుంటాడు. ఈ వరుస హత్యలకు పాల్పడుతుంది రవియాదవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనుమానించిన కిరణ్ ప్రభ టీమ్ అతడిని అరెస్ట్ చేస్తారు.
అతడు జైలులో ఉండగానే మరో పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. విచిత్రమైన వేషధారణలో వచ్చి పోలీసులను హత్య చేస్తోన్న ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులనే అతడు ఎందుకు టార్గెట్ చేశాడు? చనిపోయిన పోలీసులకు కిరణ్ ప్రభ ప్రాణ స్నేహితురాలు పల్లవి (సిరి హనుమంతు) మర్డర్‌తో సంబంధం ఉందా? పల్లవి మరణం వెనుక ప్రభాకర శర్మ సోదరుడు కరుణ (రాజా) ఉన్నాడా?
తండ్రితో పాటు కుటుంబాన్ని ద్వేషించే కరుణ వారికి ఎందుకు దూరంగా ఉన్నాడు? కిరణ్ ప్రభను ప్రేమించిన ప్రభాకరశర్మ ఆమెను పెళ్లిచేసుకున్నాడా? కిరణ్ లక్ష్యానికి అతడు ఏ విధంగా అండగా నిలబడ్డాడు అన్నదే(Puli Meka Web Series Review) ఈ సిరీస్ కథ.
రివేంజ్ డ్రామా...
సైకో కిల్లర్ కథాంశంతో పులిమేక వెబ్ సిరీస్ రూపొందింది. పోలీసులను టార్గెట్ చేసిన ఓ కిల్లర్ కథకు రివేంజ్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా కోన వెంకట్, వెంకటేష్ కిలారు ఈ కథను రాసుకున్నారు. చాలా వరకు సైకో కిల్లర్ కథల్లో మెయిన్ పాయింట్ ఒకేలా ఉంటుంది.
ఈ రొటీన్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంపైనే జయాపజయాలు ఆధారపడిఉంటాయి. ఈ విషయంలో పులి మేక వెబ్‌సిరీస్ దర్శకరచయితలు కొంత వరకు సక్సెస్ అయ్యారు. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఊహలకు అందని ట్విస్ట్ ఇస్తూ చివరి వరకు ఉత్కంఠభరితంగా సిరీస్‌ను నడిపించారు. సైకో కిల్లర్ ఎవరన్నది నాలుగైదు ఎపిసోడ్స్ వరకు రివీల్ పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను అల్లుకున్న విధానం బాగుంది.
సామాన్యురాలికి న్యాయం...
ఓ సైకో కిల్లర్‌ను కిరణ్ ప్రభ పట్టుకునే సీన్‌తోనే ఈ సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత మరో సైకో కిల్లర్ వరుసగా పోలీసులను చంపుతుండటం, ఆ కేసును కిరణ్ ప్రభ చేపట్టే సీన్స్‌తో కథాగమనం చకా చకా సాగిపోతుంది. పోలీస్ ఇన్వేస్టిగేషన్‌తో పాటు కిరణ్ ప్రభ, ప్రభాకర్ లవ్ స్టోరీని, కరుణ ఫ్యామిలీ డ్రామాను లింక్ చేస్తూ దర్శకుడు కథను(Puli Meka Web Series Review) ముందుకు నడిపించారు.
ఆ సైకో కిల్లర్ ఎవరన్నదిప్రభాకర శర్మ కనిపెట్టిన తర్వాత థ్రిల్లర్ కథ కాస్త పూర్తిగా రివేంజ్ డ్రామాగా మారిపోతుంది. సమాజంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన కొందరు యువతీయువకులు చేసిన తప్పులకు ఓ సామాన్యురాలు ఎలా బలైందన్నది చూపించారు. ఆ అమ్మాయికి కిరణ్ ప్రభ, ప్రభాకర్ కలిసి ఎలా న్యాయం చేశారో చూపించారు. తొలి నాలుగు ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా నడిపించిన దర్శకుడు చివరి నాలుగు ఎపిసోడ్స్‌లో ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు
కొత్తదనం లేదు...
పులి మేక కోసం కోన వెంకట్, వెంకటేష్ కిలారు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. రొటీన్ రివేంజ్ పాయింట్‌కు సైకో కిల్లర్ నేపథ్యాన్ని జోడించి ఈ కథను రాసుకున్నారు. తన కుటుంబాన్ని కరుణ ద్వేషించే సీన్స్ లో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సయింది. కిరణ్ ప్రభ, ప్రభాకర్ లవ్ స్టోరీ చాలా బోరింగ్‌గా సాగుతుంది. సైకో కిల్లర్ ఎవరన్నది రివీల్ అయిన తర్వాత కథ మొత్తం ప్రెడిక్టబుల్‌గా మారడం మైనస్‌గా మారింది.
లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ...
ఈ సిరీస్‌తోనే లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ ప్రభ అనే పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో లావణ్య త్రిపాఠి కనిపించింది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌లో మెప్పించింది.
ఫోరెన్సిక్ హెడ్‌గా జోవియల్ క్యారెక్టర్‌లో ఆదిసాయికుమార్ యాక్టింగ్ బాగుంది. పల్లవిగా సిరి హనుమంతు రోల్ చిన్నదే అయినా కథ మొత్తం ఆమె క్యారెక్టర్ నేపథ్యంలోనే సాగుతుంది. ఆది సాయికుమార్ తండ్రిగా గోపరాజు రమణ కనిపించారు. కామెడీ పరంగా ఆయన క్యారెక్టర్ సిరీస్‌కు ప్లస్సయింది. సుమన్‌తో పాటు రాజా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించారు.
థ్రిల్లర్ జోనర్ ఫ్యాన్స్‌కు మాత్రమే...
థ్రిల్లర్ జోనర్ ట్రెండ్‌ను ఇష్టపడేవారిని పులి మేక వెబ్‌సిరీస్ మెప్పిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో కొన్ని లోపాలున్నా చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది.