PS 1 Movie Review: పీఎస్ 1 మూవీ రివ్యూ.. మణిరత్నం మ్యాజిక్ ఫలించిందా?-ponniyin selvan movie telugu review vikram jayam ravi karthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ps 1 Movie Review: పీఎస్ 1 మూవీ రివ్యూ.. మణిరత్నం మ్యాజిక్ ఫలించిందా?

PS 1 Movie Review: పీఎస్ 1 మూవీ రివ్యూ.. మణిరత్నం మ్యాజిక్ ఫలించిందా?

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2022 03:27 PM IST

Ponniyin Selvan Movie Review: విక్ర‌మ్‌, జ‌యంర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చారిత్ర‌క చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్‌. దాదాపు రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్ రూపొందిన ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

<p>పొన్నియ‌న్ సెల్వ‌న్&nbsp;</p>
పొన్నియ‌న్ సెల్వ‌న్ (Twitter)

Maniratnam Ponniyin Selvan Movie Review: పొన్నియ‌న్ సెల్వ‌న్ మ‌ణిర‌త్నం న‌ల‌భై ఏళ్ల క‌ల‌. త‌మిళంలో క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల బెస్ట్ సెల్ల‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. చోళ సామ్రాజ్య వైభ‌వం, కుట్ర‌లు, ఆధిప‌త్య పోరుతో కూడిన ఈ చారిత్ర‌క‌ న‌వ‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌ని కెరీర్ ఆరంభం నుంచి ప్ర‌య‌త్నాలు చేసిన మ‌ణిర‌త్నం ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది త‌న‌ క‌ల‌ను సాకారం చేసుకున్నాడు. విక్ర‌మ్‌(Vikram), జ‌యంర‌వి(Jayam ravi), కార్తి, త్రిష‌(Trisha), ఐశ్వ‌ర్యారాయ్(Aishwarya rai) ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన పొన్నియ‌న్ సెల్వ‌ర్ పార్ట్ 1 నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం స్వ‌యంగా నిర్మించాడు త‌మిళ ప్రైడ్‌గా ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర యూనిట్ పేర్కొన‌డం, అగ్ర న‌టీన‌టులు ఈ సినిమాలో భాగం కావ‌డం, ట్రైల‌ర్‌, విజువ‌ల్స్‌తో దేశ‌వ్యాప్తంగా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాపై క్రేజ్ ఏర్ప‌డింది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో నేడు ఈ సినిమ రిలీజైంది. బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రానే సినిమా ఇదంటూ ట్రేడ్ వ‌ర్గాలు వేసిన అంచ‌నాల్లో నిజ‌మెంతా ఉంది? మ‌ణిర‌త్నం రూపొందించిన ఈ తొలి చారిత్ర‌క చిత్రం ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పించిందో తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

PS 1 story: పొన్నియ‌న్ సెల్వ‌న్ క‌థ‌

చోళ రాజు సుంద‌ర చోళుడికి (ప్ర‌కాష్‌రాజ్‌)ఇద్ద‌రు కుమారులు, ఓ కుమార్తె ఉంటారు. సుందర చోళుడు వయసు మీరడంతో తన తర్వాత చోళ సామ్రాజ్యానికి చ‌క్ర‌వ‌ర్తిగా పెద్ద కుమారుడు క‌రికాళ చోళుడిని (విక్ర‌మ్‌) ప్ర‌క‌టించాల‌నే ఆలోచ‌న‌లో సుంద‌ర చోళుడు ఉంటాడు. సుంద‌ర చోళుడి స్నేహితుడు పెద‌ప‌ళువెట్టియార్ (శ‌ర‌త్ కుమార్‌) మాత్రం త‌న మేన‌ల్లుడు మ‌ధురాంత‌కుడిని రాజును చేయాల‌ని సామంత‌రాజుల‌తో క‌లిసి ర‌హ‌స్య ఒప్పందాలు చేస్తుంటాడు.

త‌న రాజ్యానికి ఆప‌ద పొంచి ఉంద‌ని గ్ర‌హించిన క‌రికాళుడు ఆ విప‌త్తు గురించి తండ్రి సుంద‌ర‌చోళుడు, సోద‌రి కుంద‌వి(త్రిష‌)ల‌కు స‌మాచారం అందించే బాధ్య‌త‌ను సైన్యాధిప‌తి వ‌ల్ల‌వ‌రాయుడికి(కార్తి) అప్ప‌గిస్తాడు. మ‌రోవైపు శ్రీలంక రాజ్యాన్ని ఆక్ర‌మించే ప్ర‌య‌త్నంలో ఉన్న క‌రికాళుడి సోద‌రుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియ‌న్ సెల్వ‌న్‌కు(జ‌యం ర‌వి) పాండ్య కుట్రదారుల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంటుంది.

క‌రికాళుడుతో పాటు పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌దెవ‌రు? పెద‌ప‌ళువెట్టాయార్ వెన‌క ఉండి ఈ ప‌న్నాగాలు ప‌న్నుతున్న నందిని(ఐశ్వ‌ర్యారాయ్‌) కథేమిటి?
క‌రికాళుడు ప్రాణంగా ప్రేమించిన నందిని పెద‌ప‌ళువెట్టియార్‌ను ఎందుకు పెళ్లిచేసుకున్న‌ది? చోళ సామ్రాజ్య పతనాన్ని ఆమె కోరడానికి కారణమేమిటి? పాండ్యుల దాడుల నుంచి పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను వ‌ల్ల‌వ‌రాయుడు ర‌క్షించాడా? సోద‌రుల‌ను కాపాడుకోవ‌డానికి కుంద‌వి ఏం చేసింది? అన్న‌దే పొన్నియ‌న్ సెల్వ‌న్ మొద‌టి భాగం క‌థ‌.

PS 1 movie: ఇద్ద‌రు సోద‌రుల పోరాటం…

పొన్నియ‌న్ సెల్వ‌న్ చోళ సామ్రాజ్యం చుట్టూ సాగే ఓ క‌ల్పిత క‌థ‌. చోళ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి సామంతులు పన్నిన కుట్రలు, అతి పరాక్రమ వంతులైన చోళ రాజకుమారులకు ఎదురైన పరిణామాలతో విజువల్ వండర్ గా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఐదు భాగాలతో కూడిన ఈ చారిత్రక నవలను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డం అంటే పెద్ద సాహ‌స‌మ‌నే చెప్పాలి. కానీ మణిరత్నం మాత్రం ఈ సాహసాన్ని ధైర్యంగా చేశారు.

చోళ సామ్రాజ్య వైభ‌వంతో పాటు క‌రికాళ‌చోళుడు, పొన్నియ‌న్ సెల్వ‌న్ వీర‌త్వం, శ‌త్రువుల‌ను ఎదుర్కొని వారి సాగించిన అస‌మాన పోరాటాన్ని మొదటి భాగంలో చూపించారు మ‌ణిర‌త్నం. శత్రువుల కారణంగా వారి రాజ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపిస్తూనే అంతర్లీనంగా నందిని, కరికాళుడి విఫల ప్రేమకథతో పాటు పొన్నియన్ సెల్వన్, వల్లవరాయుడు, కుందవిల ప్రేమకథలతో అందంగా సినిమాను మలిచారు.

Ponniyin selvan: పొన్నియ‌న్ సెల్వ‌న్ ఎవ‌రు?…

కథగా చెప్పుకుంటే ఇందులో కొత్తదనం ఏమీలేదు. రాజ్యధికారం కోసం ఆధిపత్య పోరు, కుట్రలు కుతంత్రాలు, వెన్నుపోట్లతో చాలా సినిమాలొచ్చాయి. బాహుబలి కూడా ఇదే ఛాయలతో సాగుతుంది. చోళ రాజ్యంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించి సామ్రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డానికి శ‌త్రువులు ప్ర‌య‌త్నాలు చేయ‌డం, వారి ప‌న్నాగాల్ని ఎదురించి చోళ యువ‌రాజులు క‌రికాళ‌చోలుడు, పొన్నియ‌న్ సెల్వ‌న్ సాగించే చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

చోళ సామ్రాజ్యానికి శ‌త్రువులు ఎవ‌రు? న‌మ్మ‌క‌స్తులుగా ఉంటూ పెద‌వ‌ళువెట్టియార్ ఎలా వెన్నుపోటు పొడ‌వ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌న్న‌ది ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో చూపించారు మణిరత్నం. పెద‌వ‌ళువెట్టియార్ భార్య‌గా ఉంటూ అత‌డి మంచి కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా న‌టించే నందిని తాను ప్రేమించిన క‌రికాళుడిని ఎందుకు చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే ఎత్తుల‌తో క‌థ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. పాండ్యులు, పెద‌వ‌ళువెట్టియార్ పన్నిన కుట్రల నుంచి పొన్నియ‌న్ సెల్వ‌న్ బ‌య‌ట‌ప‌డ్డాడా లేదా అన్న‌ది స‌స్పెన్స్ లో పెట్టి సీక్వెల్‌లో చూడాల్సిందే అంటూ రెండో భాగంపై ఆస‌క్తిని క్రియేట్ చేశాడు మ‌ణిర‌త్నం.

PS 1 movie: నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం…

కథ రక్తి కట్టాలంటే ఎమోషన్ పండటం ముఖ్యం. అది పొన్నియన్ సెల్వన్ లో మిస్సయింది. క్యారెక్టర్స్ ఎక్కువగానే ఉన్నా వాటి మధ్య సరైన బాండింగ్ కనిపించదు. చోళ సామ్రాజ్యాన్ని పతనాన్ని కోరడానికి నందిని వేసే ఎత్తుల్లో ఆసక్తి లోపించింది. నందిని ప్రేమలో విఫలమై రాక్షసుడిగా మారిపోయానంటూ కరికాళుడి చెప్పే కథ మొత్తం సంభాషణల్లోనే నడవటం ఆకట్టుకోదు. పొన్నియన్ సెల్వన్ కథను డీటెయిలింగ్‌గా చెప్ప‌డానికే మ‌ణిర‌త్నం ప్ర‌య‌త్నించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా ముందుగానే డిసైడ్ కావడంతో ఫస్ట్ పార్ట్ మొత్తం పాత్రల పరిచయానికే ఉపయోగించుకున్నట్లుగా ఉంది. చాలా నెమ్మ‌దిగా సాగుతుంది.

ఫ‌స్ట్ హాఫ్ మొత్తం క‌రికాళుడు అప్ప‌గించిన బాధ్య‌త‌ను నేర‌వేర్చ‌డానికి వ‌ల్ల‌వ‌రాయుడు చేసే సాహ‌సాల‌తో సాగుతుంది. సీరియ‌స్ నెస్ లేకుండా సిల్లీగా ఆ సీన్స్ సాగుతాయి. సెకండాఫ్ పొన్నియ‌న్ సెల్వ‌న్ క్యారెక్ట‌ర్ గురించే చూపించారు. లెక్క‌కుమించి క్యారెక్ట‌ర్స్ ఉండ‌టంతో వాటికి త‌మిళ పేర్లు పెట్ట‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు తిక‌మ‌క‌ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. పాట‌లు క‌థ‌కు అడ్డంకిగా నిలిచాయి. వాటిలో సాహిత్యం, పిక్చరైజేషన్ తమిళ సంస్కృతికి దగ్గరగా ఉన్నాయి.

నందినిగా ఐశ్వ‌ర్యారాయ్ విల‌నిజం…

విఫల ప్రేమను మర్చిపోలేక సంఘర్షణను ఎదుర్కొనే రాక్షసుడి లాంటి రాజు పాత్రలో విక్ర‌మ్ క‌నిపించాడు. అతడి పాత్రను పరిచయం చేసిన తీరు బాగున్నా ఆ ఇంటెన్స్ మొత్తం సినిమాలో కొనసాగించలేకపోయాడు. స్క్రీన్ స్పేస్ తక్కువగానే లభించింది. నందినిగా పాజిటివ్ షేడ్స్ తో క‌నిపించే నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో ఐశ్వ‌ర్యారాయ్ ఆందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ది. చివ‌ర‌లో ఐశ్వర్య డ్యూయ‌ల్ రోల్ అంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.

కామెడీతో పాటు హీరోయిజాన్ని పండించే క్యారెక్ట‌ర్‌లో కార్తి క‌నిపించాడు. సినిమాలో ఎక్కువగా కార్తి పాత్రనే కనిపిస్తుంది. పొన్నియ‌న్ సెల్వ‌న్‌గా జ‌యంర‌వి సెకండాఫ్ మొత్తం కనిపిస్తాడు. పూర్తిగా యాక్ష‌న్ ప్ర‌ధానంగానే అతడి క్యారెక్టర్ ను తీర్చిదిద్దారు. ఈ పాత్ర కోసం తెలుగులో జయం రవి సొంతంగా డబ్బింగ్ చెప్పాడు. కుందవిగా త్రిష అందంగా కనిపించింది. ఐశ్వర్యారాయ్, త్రిష మధ్య వచ్చే రెండు సీన్స్ బాగున్నాయి. శోభిత దూళిపాళ్ల‌, ఐశ్వ‌ర్యల‌క్ష్మిల‌ను అందంగా చూపించారు మణిరత్నం.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్ల‌స్‌…

ఏ.ఆర్ రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెట్స్ కంటే ఎక్కువ‌గా రియ‌లిస్టిక్ లోకేష‌న్స్‌పైనే ఆధార‌ప‌డుతూ సినిమాను తెర‌కెక్కించ‌డం ఆక‌ట్టు్కుంటుంది. ర‌వివ‌ర్మ‌న్ విజువ‌ల్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

త‌మిళ్ నేటివిటీ ఎక్కువే…

పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా విజువ‌ల్ వండ‌ర్‌గా కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తుంది. కానీ త‌మిళ్ నేటివిటీ ఎక్కువ‌గా ఉండ‌టం, క‌థ‌, క‌థ‌నాలు నెమ్మ‌దిగా సాగ‌డంతో ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారింది. తెలుగు ఆడియోన్స్‌ను ఈ సినిమా మెప్పించ‌డం కొంత‌వ‌ర‌కు క‌ష్ట‌మే. బాహుబలికి పోటీ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా స్థాయిలో విజయాన్ని అందుకోవడం సందేహమే.

రేటింగ్‌: 2.5/5

Whats_app_banner