RRR | కెనడాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. వినూత్నంగా విషెస్ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్-ntr fans in canada makes car show and wishes to rrr movie team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr | కెనడాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. వినూత్నంగా విషెస్ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

RRR | కెనడాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. వినూత్నంగా విషెస్ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

Maragani Govardhan HT Telugu
Mar 12, 2022 04:35 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ విదేశాల్లోనూ వినిపిస్తోంది. కెనడాలో ఎన్టీఆర్ అభిమానులు కార్లతో ప్రదర్శన చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

<p>ఆర్ఆర్ఆర్‌కు వినూత్నంగా విషెస్&nbsp;</p>
ఆర్ఆర్ఆర్‌కు వినూత్నంగా విషెస్ (Twitter)

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి స్టార్లు కలిసిన చేస్తోన్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టింది. తాజాగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా పాకింది. కెనడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

yearly horoscope entry point

ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లను కార్లతో రూపొందించారు. అంతేకాకుండా ఈ ప్రదర్శనను ఓ వీడియో రూపంలో తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తుండగా.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. జనవరి 7నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఎట్టకేలకు మార్చి 25న విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఇప్పటికే సినిమా ప్రచారాలను ఘనంగా నిర్వహించిన చిత్రబృందం మరోసారి సినిమా ప్రమోషన్ కోసం వ్యూహాలను సిద్ధం చేసింది. కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో ఆర్ఆర్ఆర్ విడుదలతో సినిమా థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం మొదలుపెడతారని భావిస్తున్నారు.

రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలాయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం