Money heist Review: అదిరిపోయే ట్విస్టులు.. భారమైన భావోద్వేగాలు-money heist season 5 volume 2 review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Money Heist Review: అదిరిపోయే ట్విస్టులు.. భారమైన భావోద్వేగాలు

Money heist Review: అదిరిపోయే ట్విస్టులు.. భారమైన భావోద్వేగాలు

Maragani Govardhan HT Telugu
Jan 04, 2022 10:18 AM IST

మూడు నెలల క్రితం మనీ హైస్ట్ ఐదో సీజన్ మొదటి భాగం రిలీజ్ కాగా.. తాజాగా చివరి భాగం విడుదలైంది. ఇందులో ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సీజన్ తో మనీ హైస్ట్ సిరీస్ కు ముగింపు పడింది. మరి ప్రొఫెసర్ బృందం అనుకున్నది సాధించిందా? అనే విషయం తెలియాలంటే మనీ హైస్ట్ ఫైనల్ పార్ట్ తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.

మనీ హీస్ట్ పార్ట్ 5
మనీ హీస్ట్ పార్ట్ 5 (Hindustan times)

వెబ్ సిరీస్- మనీ హైస్ట్ పార్ట్ 5 వాల్యూమ్ 2

ముఖ్య పాత్రలు- అల్వారో మోర్టే, పెడ్రో అలోన్సో, మిగేల్ హెర్రాన్, ఉర్సులా కార్బెరో, నాజ్వా నిమ్రీ, డయానా గోమేజ్, ఫెర్నాండో కాయో

డైరెక్టర్- అలెక్స్ పినా

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో అత్యంత పాపులర్ అయిన షో మనీ హైస్ట్. 2017లో తొలి భాగం విడుదలైనప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. మొత్తం 5 భాగాలుగా తెరకెక్కిన ఈ షో అత్యంత ప్రజాదరణ పొందింది. రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ ను దోచుకోవాలని ఓ గ్రూప్ ప్రణాళిక చేస్తోంది. అందరిలా కాకుండా ప్రముఖ నగరాల పేర్లను పెట్టుకొని దోపిడీకి యత్నిస్తారు. ఈ బృందానికి సెర్జియో మార్కినా నాయకుడు. అతడినే ప్రొఫెసర్ అని పిలుస్తారు. పకడ్భందీగా ప్లాన్ చేసి బృందానికి మార్గనిర్దేశం చేయడంలో ప్రొఫెసర్ సిద్ధహస్తుడు. 

పక్కా ప్రణాళికతో రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ ను దిగ్విజయంగా దోచుకుంటారు. అంతటితో మనీ హైస్ట్ రెండు పార్ట్ లు ముగుస్తాయి. అనంతరం ఈ గ్రూప్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో బంగారాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఈ ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటారు. దీనిని మూడు భాగాలుగా విడుదల చేశారు. మూడు నెలల క్రితం మనీ హైస్ట్ ఐదో సీజన్ మొదటి భాగం రిలీజ్ కాగా.. తాజాగా ఇందులోని చివరి భాగం విడుదలైంది. ఇందులో ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సీజన్ తో మనీ హైస్ట్ సిరీస్ కు ముగింపు పడింది.

కథ..

తమాయో సైనికులను బ్యాంకులోకి పంపడంతో వారిని ప్రతిఘటించే తరుణంలో టోక్యో చనిపోతుంది. ఆమె మరణంతో విచారకరమైన రీతిలో మనీ హైస్ట్ సీజన్-5 మొదటి భాగం ముగుస్తుంది. బృందంలో కీలకమైన టోక్యో మరణం మిగిలిన వారిని అత్యంత బాధిస్తుంది. అప్పటికే నైరోబి చావుతో కుదేలైన ప్రొఫెసర్ ను.. తనకు ఎంతో ఇష్టమైన టోక్యో కూడా దూరమవడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరోపక్క తాను కాపాడిన ఎలిసియా సియార్రా కూడా తన బిడ్డతో కలిసి పారిపోతుంది. దీంతో ప్రొఫెసర్ కు దెబ్బ మీద దెబ్బ పడినట్లవుతుంది. 

ఎలిసియాను వెంబడిస్తూ వెళ్లి చివరకు ఆమెకే బందీగా చిక్కుతాడు. బ్యాంక్ లో ఉన్న బృందానికి ప్రొఫెసర్ తో కమ్యూనికేషన్ తెగిపోతుంది. అంతేకాకుండా తమను అంతమొందించడానికి వచ్చిన సైనికులు రాజీకి వచ్చినట్లే వచ్చి సీక్రెట్ ఆపరేషన్ కు ఒడిగడతారు. ఇన్ని సమస్యల మధ్య ప్రొఫెసర్ బృందం అనుకున్నది సాధించిందా? ప్రొఫెసర్ ఎలా తప్పించుకున్నాడు? బంగారాన్ని దిగ్విజయంగా బ్యాంక్ నుంచి బయటకు తీసుకొస్తారా? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనీ హైస్ట్ చివరి పార్ట్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

ఇంతకుముందు సీజన్ల మాదిరిగానే థ్రిల్లింగ్ సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ప్రేక్షకులను కనురెప్ప వేయనీయకుండా సీట్ ఎడ్జ్ లో పెట్టడంలో దర్శకుడు మళ్లీ విజయవంతమయ్యాడు. అయితే ఈ సారి భావోద్వేగాల మోతాదును కొంచెం పెంచాడు. టోక్యో మరణం అందర్నీ కంటతడి పెట్టేలా చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ లోనూ భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రొఫెసర్ కు తన సోదరుడు బెర్లిన్ తో ఉన్న బంధాన్ని, కుటుంబ విలువలను ఇందులో మరింత ఎక్కువగా చూపించారు. 

అంతేకాకుండా తన బృందం కోసం ప్రొఫెసర్ లొంగిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బంగారాన్ని బయటకు తీసుకొచ్చే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు కొన్ని అదిరిపోయే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా బంగారం దోపిడీకి ఆర్థిక సంక్షోభానికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. ప్రేక్షకుడు ఒప్పుకునేలా చేయడంలో విజయవంతమయ్యాడు.

సాంకేతిక అంశాలు..

మనీ హైస్ట్ మొదటి సీజన్ నుంచి సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించారు దర్శకులు. ఇందులోనూ ఏ మాత్రం తగ్గకుండా అంతర్జాతీయ స్థాయికి తగినట్లుగా తీయడంలో సఫలీకృతులయ్యారు. ఛేజింగ్ సీన్లు, టెక్నాలజీ వినియోగం కళ్లకు కట్టినట్లు చూపించారు. థ్రిల్లింగ్ మ్యూజిక్ ఆడియెన్స్ ను వెబ్ సిరీస్ లో లీనమయ్యేలా చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగా పండాయి. వాటిని తెరపై తెలివిగా జొప్పించగలిగాడు. స్క్రీన్ ప్లే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు తెలివిగా కథను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు.

ఎవరెలా చేశారంటే..

ఈ భాగంలో ప్రొఫెసర్(అల్వారో మోర్టె) వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. నటన విషయానికొస్తే అందరికంటే ఆయనకే ఎక్కువ మార్కులు పడతాయి. క్రితం సీజన్లతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ లో ప్రొఫెసర్ బాగా లీనమయ్యాడు. క్లైమాక్స్ లో తమాయో(ఫెర్నాండో కాయో)తో జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. 

రకేల్ అలియస్ లిస్బన్(ఇట్జియార్ ఇటునో), ఎలిసియా పోటీ పడి నటించారు. వీరితో పాటు మిగిలిన వారు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇంతకు ముందు సీజన్ తో పోలిస్తే ఈ భాగంలో పాలెర్మో(రోడ్రిగ్ డి లా సెర్నా) పాత్ర ప్రాధాన్యత తగ్గింది. అయినప్పటికీ తన పరిధిలో బాగానే నటించాడు.

చివరిగా మనీ హైస్ట్ ఫైనల్ పార్ట్.. ట్విస్టులతో కూడిన ఎమోషనల్ థ్రిల్లింగ్ సిరీస్

రేటింగ్- 4/5

గమనిక: ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం