Maayon Movie Review: మాయోన్ మూవీ రివ్యూ - బాహుబలి కట్టప్ప కొడుకు మూవీ ఎలా ఉందంటే?
Maayon Movie Review: తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటించిన మాయోన్ మూవీ ఇటీవల ఆమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎన్ కిషోర్ దర్శకత్వం వహించాడు.
Maayon Movie Review: బాహుబలి కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ (Sibi Satyaraj) హీరోగా నటించిన మాయోన్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) రిలీజైంది. ఓ పురాతన గుడి మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎన్ కిషోర్ దర్శకత్వం వహించాడు. తాన్య రవిచంద్రన్, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. మాయోన్ సినిమా ఎలా ఉందంటే...
గుడి మిస్టరీ...
ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు వరుసగా హత్యలకు గురవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. పురాతన విగ్రహాల్ని వెలికితీసిన అధికారుల్ని చంపేసి ఆ విగ్రహాల్ని విదేశాలకు అమ్ముతుంటాడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసే సీనియర్ ఆఫీసర్ దేవరాజ్ (హరీష్ పేరడి). అతడికి అర్జున్ (శిబి చక్రవర్తి) సహాయం చేస్తుంటాడు. పల్లికొండ అనే ప్రాంతంలో ఉన్న పురాతన కృష్ణుడి టెంపుల్‌లో ఓ రహస్య గదిలో ఉన్న వందల కోట్ల రూపాయల నిధి ఉందని దేవరాజ్ తెలుసుకుంటాడు.
అర్జున్ సహాయంతో ఆ నిధిని కొట్టేయాలని దేవరాజ్ ప్లాన్ చేస్తాడు. సాయంత్రం ఆరు తర్వాత ఆ గుడిలో అడుగుపెట్టిన వాళ్లందరూ మతిస్థిమితం కోల్పోతుంటారు. ఆ గుడిలో రాత్రి పూట గంధర్వులు సంగీతం వాయిస్తుంటారని, అందులో ఓ పాము ఉందని రకరకాల కథనాలు ప్రచారంలో ఉంటాయి.
వాటన్నింటిని అర్జున్ పట్టించుకోడు. ఆ రహస్య గదికి సంబంధించిన క్లూస్‌తో పాటు ఆ గదిని ఓపెన్ చేయడానికి అవసరమైన కీ కూడా ఆ టెంపుల్‌లోనే ఉందని అర్జున్ అన్వేషణలో తెలుతుంది.
ఆ గదిని తెరిచేందుకు ఓ రాత్రి అసిస్టెంట్స్ అంజనతో పాటు మరో ఇద్దరితో కలిసి గుడిలో అడుగుపెడతాడు అర్జున్. ఆ గుడిలో నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా? ఆ రహస్య గది ఆచూకీని అర్జున్ తన తెలివితేటలతో ఎలా కనిపెట్టాడు?
ఆ గుడిలో అంజనతో పాటు అర్జున్ అసిస్టెంట్స్‌కు ఎలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయి? నిధిని కనిపెట్టిన తర్వాత అర్జున్‌ను చంపేయాలని ఓ ఫారిన్ మాఫియా డాన్ తో కలిసి దేవరాజ్ వేసిన ప్లాన్‌ను అతడు ఎలా తిప్పికొట్టాడు? అర్జున్ నిజంగా ఆర్కియాలజీ ఉద్యోగినేనా? అన్నదే మాయోన్ (Maayon Movie Review)మూవీ రివ్యూ.
అనంతపద్మనాభస్వామి కథతో...
2011లో కేరళలోని అనంతపద్మనాభ స్వామి గుడిలోని ఐదు రహస్య గదుల్లో ఉన్న అంతులేని సంపదను ప్రభుత్వం వెలికితీసింది. ఆరోగదికి నాగబంధనం ఉండటంతో ఆ గదిని ఇప్పటికీ తెరవలేకపోయారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఆరో రహస్య గదిలో వేల కోట్ల బంగారు నిధులు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ కథనాల స్ఫూర్తితోనే మాయోన్(Maayon Movie Review) సినిమా తెరకెక్కింది.
దేవుడా...సైన్సా...
పురాతన ఆలయంలో రహస్యంగా భద్రపరచిన కోట్ల రూపాయల సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసిన ఓ గ్యాంగ్ కథతో చివరి వరకు థ్రిల్లింగ్‌గా దర్శకుడు కిషోర్ మాయోన్ సినిమాను నడిపించారు. దేవుడు గొప్పదా...సైన్స్ గొప్పదా అన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది. ఈసినిమాలోనూ(Maayon Movie Review) ఆ పాయింట్‌ను టచ్ చేశారు దర్శకుడు. ఒకరి వాదన తప్పు...మరొకరి వాదన ఒప్పు అన్నట్లుగా కాకుండా దేవుడుతో పాటు సైన్స్ రెండు ఉన్నాయని ఈ సినిమాలో చూపించారు.
నిధి అన్వేషణ...
నిధి అన్వేషణ తో పాటు గుడి చరిత్ర, పురాతన విగ్రహాల్ని విదేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ముఠాల పలు అంశాలతో కథను లింక్ చేయడం బాగుంది. నెగెటివ్ షేడ్స్‌తో హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేసి చివరలో పోకిరి టైప్‌లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కానీ అది ఎక్స్‌పెక్ట్‌చేసేలానే ఉంది.
నిధి అన్వేషణ సినిమాలు చాలా వరకే ఒకే ఫార్మెట్‌లో ఉంటాయి. నిధి తాలూకు చిక్కుముడులను హీరో తన తెలివితేటలతో కనిపెట్టడం కామన్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలో(Maayon Movie Review) కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్టర్. గుడిలోని రహస్య గది క్లూను హీరో కనిపెట్టే సీన్స్‌లో కొన్ని సిల్లీగా అనిపిస్తాయి.
గుడిలో హీరో గ్యాంగ్ అడుగుపెట్టిన తర్వాత వారికి ఎదురయ్యే విచిత్ర అనుభవాల్ని మరికొంత ఎంగేజింగ్‌గా చూపిస్తే బాగుండేది. కథలో అనవసరంగా రెండు పాటల్ని ఇరికించారు. ఇళయరాజా నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్ కూడా కన్వీన్సింగ్‌గా అనిపించదు.
అర్జున్ పాత్రలో..
అర్జున్ అనే తెలివైన అర్కియాలజిస్ట్‌గా శిబి సత్యరాజ్ సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు. ఒకే టైప్ ఎమోషన్స్‌తో చివరి వరకు అతడి క్యారెక్టర్ సాగింది. తాన్య రవిచంద్రన్‌ను హీరోయిన్‌లా కాకుండా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది. విలన్‌గా హరీష్ పేరడి, నిజాయితీపరుడైన అధికారిగా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తమ నటనానుభవంతో పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
Maayon Movie Review -అమెజాన్ ప్రైమ్‌లో...
మాయోన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా లవర్స్‌ను మెప్పిస్తుంది. తెలుగు ఆడియోతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఉంది.