Lgm Telugu Release Date: పవన్ కళ్యాణ్ దెబ్బకు వెనక్కి వెళ్లిన ధోనీ - తెలుగులో వారం ఆలస్యంగా ఎల్‌జీఎమ్ రిలీజ్
Lgm Telugu Release Date: టీమ్ ఇండియా క్రికెటర్ ధోనీ నిర్మించిన ఎల్‌జీఎమ్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ మారింది. వారం ఆలస్యంగా ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అందుకు కారణం ఏమిటంటే?
Lgm Telugu Release Date: పవన్ కళ్యాణ్ బ్రో ధాటికి ధోనీ మూవీ వారం వాయిదాపడింది. తమిళ మూవీ ఎల్జీఎమ్తో టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ ధోనీ సినిమా ప్రొడక్షన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించిన నటించిన ఈ సినిమాను ధోనీ సమర్పణలో ఆయన భార్య సాక్షి ధోనీ స్వయంగా నిర్మించింది. ఎల్‌జీఎమ్ మూవీకి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించాడు.
కాగా ఎల్‌జీఎమ్ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్స్‌లో సినిమా హీరోహీరోయిన్లతోపాటు సాక్షి ధోనీ కూడా పాల్గొన్నది. ఈ సినిమా తమిళంలో ఈ శుక్రవారం (జూలై 28న) రిలీజ్ కానుంది. తెలుగులో మాత్రం వారం ఆలస్యంగా ఆగస్ట్ 4న ఎల్జీఎమ్నుప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సాక్షి ధోనీ ప్రకటించింది.
తెలుగులో ఈ వారం పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ బ్రో మూవీ పోటీని తట్టుకొని ఎల్‌జీఎమ్ బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే. థియేటర్లు కూడా తక్కువ సంఖ్యలో దొరికే అవకాశం ఉండటంతోనే ఎల్‌జీఎమ్ తెలుగు వెర్షన్‌ను వారం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎల్‌జీఎమ్ మూవీ తెరకెక్కుతోంది.
తనకు కాబోయే అత్తగారు ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకున్న ఓ యువతి ఆమెతో కలిసి వారం రోజుల పాటు ట్రిప్ ప్లాన్ చేస్తుంది. ఈ ట్రిప్‌లో తల్లితో పాటు కాబోయే భార్య మధ్య ఓ యువకుడు ఎలా నలిగిపోయాడనే కథాంశంతో వినోదాత్మకంగా దర్శకుడు రమేష్ తమిళమణి ఈ మూవీని తెరకెక్కించాడు.
ఎల్‌జీఎమ్ సినిమాలో నదియా, యోగిబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ధోనీతో పాటు తాను సినిమా ప్రియులమని, ఆ ఇష్టంతోనే ఎల్‌జీఎమ్ మూవీని నిర్మించినట్లు సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన తెలుగు ప్రమోషన్స్‌లో సాక్షి ధోనీ చెప్పింది.