Krishna Last Photo: హాస్పిటల్‌ బెడ్‌పై కృష్ణ.. చివరి ఫొటో అంటూ వైరల్‌ అవుతున్న పిక్‌-krishna last photo is now going viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Last Photo: హాస్పిటల్‌ బెడ్‌పై కృష్ణ.. చివరి ఫొటో అంటూ వైరల్‌ అవుతున్న పిక్‌

Krishna Last Photo: హాస్పిటల్‌ బెడ్‌పై కృష్ణ.. చివరి ఫొటో అంటూ వైరల్‌ అవుతున్న పిక్‌

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 09:25 PM IST

Krishna Last Photo: హాస్పిటల్‌ బెడ్‌పై కృష్ణ ఉన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే ఆయన చివరి ఫొటో అంటూ కొందరు ఈ పిక్‌ను షేర్‌ చేస్తున్నారు.

హాస్పిటల్ బెడ్ పై కృష్ణ చివరి ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్
హాస్పిటల్ బెడ్ పై కృష్ణ చివరి ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్

Krishna Last Photo: టాలీవుడ్‌ తొలి సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం (నవంబర్ 15) కన్నుమూసిన విషయం తెలుసు కదా. బుధవారం (నవంబర్‌ 16) ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కృష్ణను హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.

అయితే ఇప్పుడు కృష్ణకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. అది ఆయన హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్నప్పటి ఫొటో. ఇదే కృష్ణ చివరి ఫొటో అంటూ కొందరు సోషల్‌ మీడియా వైరల్‌గా మార్చేస్తున్నారు. ఈ ఫొటోలో మాస్క్‌ పెట్టుకున్న కృష్ణ హాస్పిటల్‌ బెడ్‌పై ఉండగా.. ఆయనకు సెలైన్లు ఎక్కిస్తుండటం చూడొచ్చు. అయితే ఇదే చివరి ఫొటో అన్న ప్రచారం ఎంత వరకూ నిజమన్నది తెలియలేదు.

గుండెపోటుకు గురై హాస్పిటల్‌లో చేరిన తర్వాత కూడా కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. కృష్ణ అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు ఆయన చనిపోయిన తర్వాత మీడియాకు వెల్లడించారు. ఏకంగా 9 మంది డాక్టర్ల బృందం కృష్ణను బతికించడానికి శ్రమించినా ఫలితం లేకపోయింది.

తమ సూపర్‌స్టార్‌ను కడసారి చూసేందుకు బుధవారం పెద్ద ఎత్తున అభిమానులు పద్మాలయా స్టూడియోకు తరలి వచ్చారు. అయితే కృష్ణ అంత్యక్రియలు మాత్రం మహాప్రస్థానంలో కొద్దిమంది సమక్షంలో మాత్రమే జరిగాయి. ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్ బాబు ఆయనకు తలకొరివి పెట్టారు.

ఆ సమయంలో మహేష్ దుఃఖం ఆపుకోలేకపోయినట్లు కూడా సన్నిహితులు తెలిపారు. ఈ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. మహేష్‌ ఈ ఏడాది తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాడు. ఏడాది మొదట్లో అన్న రమేష్‌ బాబు, సెప్టెంబర్‌లో తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా మహేష్‌ బాబుకు దూరమయ్యారు. ఈ విషాదం నుంచి అతడు తేరుకోవడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది.

Whats_app_banner