Viral | ఫుట్‌బాల్ మ్యాచ్‌లో 'పుష్ప' స్టెప్.. తగ్గేదేలే అంటున్న స్టార్ ప్లేయర్
పుష్ప ఐకాన్ స్టెప్పుతో ఫుట్‌బాల్ స్టార్ ఈనీస్ సిపోవిచ్ సందడి చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో సోమవారం నాడు కేరళ, ఈస్ట్ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన తర్వాత ఈ స్టెప్ వేసి ఆకట్టుకున్నాడు. కేరళ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ యూగోస్లావియా స్టార్.
సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. పుష్ప మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు శ్రీవల్లీ సాంగ్‌లోని ఐకాన్ స్టెప్‌తో పాటు తగ్గేదేలే.. అనే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సామాజిక మాధ్యమాన్ని షేక్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ, క్రికెట్ ప్రముఖులు ఎంతో మంది పుష్ప స్టెప్పులతో తమ కాలును కదిపి అదరగొట్టారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ స్టార్లకు కూడా ఈ మేనరిజాన్ని అనుకరిస్తున్నారు. భారత ఫుట్‌బాలు టోర్నమెంట్ ఇండియన్ సూపర్‌లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో ఆటగాడు గోల్ కొట్టిన తర్వాత శ్రీవల్లీ సాంగ్‌లోని ఐకాన్ స్టెప్పు వేసి సంబురాలు చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం నాడు కేరళ బ్లాస్టర్స్, ఈస్ట్ బెంగాల్ స్పోర్ట్స్ బెంగాల్(SCEB) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కేరళ ఆటగాడు ఈనిస్ సిపోవిచ్ 49వ నిమిషంలో అద్భుతమైన గోల్ కొట్టాడు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో మొదటి గోల్ కొట్టిన ఈ 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబాహుడు సంబురాలు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా పుష్ప చిత్రంలోని శ్రీవల్లీ సాంగ్ ఐకాన్ స్టెప్పు వేసి తగ్గేదేలే అంటూ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. విభిన్నంగా పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. తగ్గేదేలే.. అంటూ తనదైన శైలిలో స్పందనను తెలియజేశారు.
ఈ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 1-0 తేడాతో ఈస్ట్ బెంగాల్ జట్టుపై విజయం సాధించింది. ఫలితంగా కీలక మైన టాప్-4లో చోటు దక్కించుకుంది. మొదటి అర్ధభాగంలో ఆధిపత్యం చెలాయించిన ఈస్ట్ బెంగాల్ స్పోర్ట్స్ క్లబ్ సెకాండ్ ఆఫ్‌లో పట్టు కోల్పోయింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్‌లో ఏకైక గోల్‌తో విజయాన్ని సాధించింది. శనివారం నాడు ఈ జట్టు ఏటీకే ఫుట్‌బాల్ క్లబ్ టీమ్‌తో తలపడనుంది.
సంబంధిత కథనం