Kanguva OTT Release Date: కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఒక రోజు ముందే వచ్చేస్తోంది.. తెలుగులోనూ..
Kanguva OTT Release Date: కంగువ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే సూర్య నటించిన ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.
Kanguva OTT Release Date: సూర్య నటించిన కంగువ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
కంగువ ఓటీటీ రిలీజ్ డేట్
భారీ బడ్జెట్, అంతకన్నా భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ కంగువ. గత నెల 14న థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలను ఏమాత్రం అందుకోలేక తొలి రోజు నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని నెల రోజుల్లోపే అంటే డిసెంబర్ 12 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.
నిజానికి డిసెంబర్ 13న ఓటీటీలోకి రావచ్చని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక రోజు ముందే రాబోతున్నట్లు తాజాగా మరో అప్డేట్ వస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రైమ్ వీడియో ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
కంగువ డిజాస్టర్
కంగువ ఓ పీరియడ్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ. బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ గా మిగిలిపోయింది.
తొలి షో నుంచే వచ్చిన మిక్స్‌డ్ టాక్ కాస్తా.. తర్వాత పూర్తిగా నెగటివ్ గా మారిపోయింది. దీంతో 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.105 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో గ్రాస్ వసూళ్లు రూ.82 కోట్లుగా, నెట్ వసూళ్లు రూ.69 కోట్లుగా ఉన్నాయి.
కంగువ డిజిటల్ హక్కులు
కంగువ మూవీపై మొదటి నుంచీ ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా హక్కులను రికార్డు ధరకు దక్కించుకుంది. కంగువ మూవీ డిజిటల్ హక్కులు సుమారు రూ.100 కోట్లుగా ఉండొచ్చని వార్తలు వచ్చాయి. నిజానికి థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతగానీ మూవీని ఓటీటీలోకి తీసుకురాకూడదన్న ఒప్పందం ఉంది.
కానీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఇప్పుడు నాలుగు వారాల్లోనే మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. డిసెంబర్ 12 నుంచి కంగువ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
కంగువ మూవీ ఎలా ఉందంటే?
కంగువ మూవీతో డైరెక్టర్ శివ ఏకంగా వెయ్యి ఎళ్లు వెనక్కి వెళ్లిపోయాడు. 1070 కాలంలో ఉన్న ఆటవిక తెగలకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కంగువ కథను రాసుకున్నాడు. ఆ కాలంలో ఆధిపత్యం కోసం జాతులు, వర్గాల మధ్య పోరాటం ఎలా సాగేది? ఈ వర్గ పోరాటాన్ని అలుసుగా తీసుకొని మన దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి విదేశీయులు ఎలాంటి కుట్రలు పన్నారు? ఓ పోరాట యోధుడు విదేశీయుల కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడనే అంశాలతో యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో విజువల్ వండర్‌గా కంగువను తీర్చిదిద్దారు.
కథ కంటే దర్శకుడు సూర్య ఇమేజ్, అతడి హీరోయిజాన్ని నమ్ముకొనే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కంగువ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను రాసుకున్న తీరుతో పాటు వాటిని విజువల్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. కానీ రెండు కాలాల మధ్య కనెక్షన్ అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు.