Indian 3: కమల్ హాసన్ ‘భారతీయుడు 3’ కూడా ఉంటుందా! బిగ్ హింట్-kamal hasan indian 3 on cards udhayanidhi stalin gives big hint ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 3: కమల్ హాసన్ ‘భారతీయుడు 3’ కూడా ఉంటుందా! బిగ్ హింట్

Indian 3: కమల్ హాసన్ ‘భారతీయుడు 3’ కూడా ఉంటుందా! బిగ్ హింట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 29, 2023 03:05 PM IST

Indian 3: కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 3 చిత్రం కూడా వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ జరుగుతోంది.

ఉదయనిధి స్టాలిన్, కమల్‍ హాసన్ (Photo: Twitter)
ఉదయనిధి స్టాలిన్, కమల్‍ హాసన్ (Photo: Twitter)

Indian 3: లోక నాయకుడు, స్టార్ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమా సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయాన్ని దక్కించుకుంది. కాగా, ఈ చిత్రానికి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్‍గా ఇండియన్ 2 (భారతీయుడు 2) రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరింది. కమల్ - శంకర్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఇండియన్ 3 (భారతీయుడు 3) కూడా ఉంటుందని తాజాగా హింట్ బయటికి వచ్చింది. ఇండియన్ 2 చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారు.

తాను హీరోగా నటించిన మామన్నన్ సినిమా ప్రమోషన్లలో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అలాగే, ఇండియన్ 2 సినిమాకు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరిస్తున్నారు. అయితే, మామన్నన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇండియన్ 3 గురించి స్టాలిన్ హింట్ ఇచ్చారు.

“తాజాగా వారు (నటీనటులు, సాంకేతిక సిబ్బంది) దక్షిణాఫ్రికాలో భారీ షెడ్యూల్ (ఇండియన్ 2 కోసం) పూర్తి చేసుకున్నారు. మేం ఇండియన్ 3 చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే వాళ్లు ఉంకా ఈ విషయంపై నిర్ణయానికి రాలేదు. వినియోగించని ఫుటేజ్ వారి వద్ద చాలా మిగిలిపోతుందని ఫిల్మ్ మేకర్స్ నాకు చెప్పారు. కమల్, శంకర్ చాలా ఆనందంగా ఉన్నారు” అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా 25 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. 2024 ఏప్రిల్‍లో ఇండియన్ 2 చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది.

తమిళనాడు కేబినెట్‍లో మంత్రిగా నియమితుడవటంతో ఇక నటుడిగా, నిర్మాతగా ఉండబోనని ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. నటుడిగా మామన్నన్ తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. ఈ చిత్రం నేడే (జూన్ 29) తమిళంలో విడుదలైంది.

కాగా, ఇండియన్ 2 ప్రాజెక్టు కష్టాల్లో పడిన సమయంలో మళ్లీ మొదలయ్యేందుకు స్టాలిన్ కృషి చేశారు. 2020లో ఇండియన్ 2 సెట్‍లో భారీ ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోవటంతో షూటింగ్ చాలా కాలం నిలిచిపోయింది. ఈ ఘటన తర్వాత దర్శకుడు శంకర్, సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తలెత్తాయి. న్యాయపోరాటం వరకు వెళ్లింది. అయితే, కమల్ నటించిన విక్రమ్ సినిమా గతేడాది సూపర్ హిట్ అవటంతో ఇండియన్ 2పై మళ్లీ ఆశలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాణంలో రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్ తరఫున స్టాలిన్ భాగమయ్యారు. మొత్తం వ్యవహారమంతా సర్దుకొని షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పుడు తుదిదశకు వచ్చింది. ఇండియన్ 2 చిత్రంలో కమల్ హాసన్ హీరోగా కాగా.. ఎస్‍జే సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024