Jallikattu Web Series Review: జల్లికట్టు వెబ్ సిరీస్ రివ్యూ - వెట్రిమారన్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?
Jallikattu Web Series Review: తమిళ దర్శకుడు వెట్రిమారన్ షో రన్నర్‌గా వ్యవహరించిన జల్లికట్టు సిరీస్ ఆహా ఓటీటీ ద్వారా తెలుగులో రిలీజైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే...
Jallikattu Web Series Review: కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ షో రన్నర్‌గా వ్యవహరించిన వెబ్ సిరీస్ జల్లికట్టు. కాంతార కిషోర్, కలైయరాసన్, షీలారాజ్‌కుమార్,ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఇటీవల ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎనిమిది ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు రాజ్‌కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళనాడు సంప్రదాయ ఆట జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అన్నది చూద్దాం...
జల్లికట్టు కథ...
ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ముల్లైయూరు, తామరకులం ఊళ్ల మధ్య తరతరాలుగా ఆధిపత్య పోరు నెలకొంటుంది. పాత గొడవలను పక్కనపెట్టి ముల్లైయూరు ప్రజలు పశువులను కాయడం వృత్తిగా చేసుకొని బతుకుతుంటారు. జల్లికట్టు ఆటలో తామరకులం జమీందారు సెల్వశేఖరన్(వేల రామ్‌మూర్తి) ఎద్దును ముల్లైయూరు నాయకుడు ముత్తయ్య (కిషోర్) మేనల్లుడు పాండి (కలైయరాసన్) లొంగదీసుకుంటాడు.
దాంతోరెండు ఊళ్ల మధ్య తిరిగి గొడవలు మొదలవుతాయి. ఈ గొడవల్లో పాండి హత్యకు గురవుతాడు. దాంతో ప్రతీకారేచ్చతో సెల్వశేఖరన్‌పై ముత్తయ్య దాడిచేస్తాడు. ఆ దాడి నుంచి సెల్వశేఖరన్ తప్పించుకున్నాడా? తండ్రి నుంచి ఊరి పెత్తనాన్ని చేజిక్కించుకున్న వీరశేఖరన్ (బాలా హసన్) తన కుట్రలు, కుతంత్రాలతో ప్రజల మధ్య ఎలాంటి గొడవల్ని సృష్టించాడు?
ఈ గొడవల కారణంగా స్టాండప్ కమెడియన్ పార్తిబన్ (ఆంటోనీ) , తేన్‌మేళీ (పార్తిబన్) ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి. తన ఎద్దు కాళీని జల్లికట్టులో లొగదీసుకుంటేనే పెళ్లిచేసుకుంటానని తేన్‌మోళీ చేసిన ఛాలెంజ్‌లో పార్తిబన్ నెగ్గాడా? వారి ప్రేమకు ముత్తయ్య ఎలా అండగా నిలిచాడు అన్నదే జల్లికట్టు సిరీస్ కథ.
జమీందారు పెత్తనం...
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్లు బ్యాక్‌డ్రాప్‌కు రెండు ఊళ్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు,కుల అంతరాలతో పాటు ప్రేమకథను జోడిస్తూ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకుడు రాజ్‌కుమార్. పేరుప్రఖ్యాతులు, పెత్తనాల కోసం జరిగే యుద్దాలకు ముగింపు అనేది ఉండదు. ఈ గొడవల్లో జీవితాలు నాశనం అవడం తప్పితే గెలుపు ఓటములు ఎవరికీ దక్కవు.
ఈ యుద్దాలు చేసే వారి కంటే వాటికి దూరంగా జీవితాలు గడిపే వాళ్లే పేర్లు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయనే సందేశంతో జల్లికట్టు సిరీస్ రూపొందింది. జమీందారుల కాలంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం సామాన్యుల జీవితాలతో పావులుగా చేసుకుంటూ వారు చేసిన దురాగతాలను ఈ సిరీస్ చూపించారు. జల్లికట్టు ఆట నేపథ్యం, కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ షో రన్నర్‌గా వ్యవహరించడంతో ఈ సిరీస్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
ఎనిమిది ఎపిసోడ్స్...
జల్లికట్లు అనే బ్యాక్‌డ్రాప్ తప్పితే మిగిలిన కథ మొత్తం రోటీన్‌గా సాగుతోంది. ఎన్నో సినిమాలు, సిరీస్‌లలో వచ్చిన పేద, ధనిక మధ్య పోరునే ఈ సిరీస్‌లో చూపించారు. జమీందారు సెల్వశేఖరన్‌తో పాండి ఛాలెంజ్ చేయడం, జల్లికట్టులో పాండి ధీరత్వం చుట్టూ నాలుగు ఎపిసోడ్స్ సాగుతాయి. పాండి హత్య తర్వాత కొత్త పాత్రలు పార్తిబన్, తేన్‌మోళీ ఎంట్రీ ఇవ్వడం, వారి ప్రేమకథతో మిగిలిన నాలుగు ఎపిసోడ్స్ తెరకెక్కించారు.
దాంతో రెండు వేర్వేరు కథలు అనే ఫీలింగ్ కలుగుతుంది. వాటికి కలుపుతూ అల్లుకున్న లాజిక్స్ పెద్దగా బలం లేదు. ముత్తయ్య పాత్రను యోధుడిగా పరిచయం చేసి చివరకు సాదాసీదాగా ముగించారు. జమీందారు సెల్వశేఖరన్ విలనిజం వర్కవుట్ అయ్యింది. వీరశేఖర్ వేసే ఎత్తులను సరిగా రాసుకోలేదు. క్లైమాక్స్ కృత్రిమంగా ఉంది. జల్లికట్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కంప్లీట్‌గా తమిళ నేటివిటీలో సిరీస్ సాగుతుంది. దానికితోడు తమిళ పేర్లను తెలుగులోనూ వాడారు. దాంతో తెలుగు ఆడియెన్స్ కథ, పాత్రలతో కనెక్ట్ కావడం ఇబ్బందిగా మారింది.
ముత్తయ్య పాత్రలో...
ముత్తయ్యగా కాంతార కిషోర్ క్యారెక్టర్ దృక్కోణం నుంచే ఈ సిరీస్ మొదలవుతుంది. ఆవేశంతో యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత తన తప్పును తెలుసుకొనే వ్యక్తిగా కిషోర్ నటన బాగుంది. ఆవేశపరుడైన యువకుడిగా కలైయరసన్ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగింది.
అతడి క్యారెక్టర్ ఉన్నంత సేపు సిరీస్ ఆసక్తిని పంచుతుంది. తేన్‌మోళీగా షీలా రాజ్‌కుమార్, పార్తిబన్‌గా ఆంటోనీ నటన సహజంగా ఉంది. బాలాహసన్,వేల్ రామమూర్తితో పాటు ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారు.
వెట్రిమారన్ పేరు చూసి...
జల్లికట్టు అనే టైటిల్‌లో ఉన్న కొత్తదనం, కథ, కథనాల్లో లేదు. డైరెక్టర్ వెట్రి మారన్ పేరు చూసి వైవిధ్యత ఉంటుందని నమ్మి సిరీస్ చూస్తే నిరాశపడకతప్పదు. కంప్లీట్ తమిళ వాసనలతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.
రేటింగ్: 2.5/5