అసలు ఈ పాన్ ఇండియా అంటే ఏంటో.. కేజీఎఫ్2పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే సౌత్ సత్తా ఏంటో గుర్తిస్తున్న అక్కడి స్టార్లు కొందరు.. ఈ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్. ఇదే విషయాన్ని మొన్న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చిరంజీవి చెబుతూ.. సౌత్ సినిమాలను చిన్నచూపు చూడటం తాను అవమానంగా భావించినట్లు చెప్పాడు. కానీ బాహుబలి తర్వాత సీన్ మారిపోయింది. ఆ స్ఫూర్తితో తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా సినిమాల వెల్లువ మొదలైంది. గత నాలుగు నెలల్లోనే హిందీ బెల్ట్‌లో మూడు సౌత్ సినిమాలు దుమ్మురేపాయి.
ఈ సక్సెస్‌పై కొందరు బాలీవుడ్ స్టార్లు మంచిదేగా అంటూ స్పందించగా.. మరికొందరికి మాత్రం ఇది పెద్దగా నచ్చనట్లు కనిపిస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ ఈ ట్రెండ్‌పై స్పందించాడు. ఈ మధ్యే తన దస్వీ మూవీని థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసిన అతడు.. సౌత్ సినిమాల సక్సెస్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. అసలు ఈ పాన్ ఇండియా అంటే ఏంటో తనకు తెలియదని, దీన్ని తాను విశ్వసించనని అభిషేక్ అనడం విశేషం. అసలు ఈ పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో కాకుండా మరేదైనా ఇండస్ట్రీలో ఉపయోగిస్తున్నారా అని ఎదురు ప్రశ్నించాడు.
హిందీలో కేజీఎఫ్2తోపాటు పుష్ప, ఆర్ఆర్‌ఆర్ సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పాడు. సినిమాకు భాషతో సంబంధం లేదని, ఏ భాషలో వచ్చినా చివరికి అది ఒక సినిమానే అని అన్నాడు. హిందీ సినిమాల్లో కంటెంట్ లేదన్న విమర్శలను అతడు ఖండించాడు. హిందీలోనూ చాలా మంచి సినిమాలు వస్తున్నాయని చెప్పాడు. సినిమాలో కంటెంట్ బాగుంటే.. ఏ భాషలో అయినా హిట్ అవుతుందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం
టాపిక్