Flash Back : చిరంజీవి, బాలకృష్ణ ప్రయాణించే ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్.. ఆ రోజు ఏం జరిగింది?
Tollywood Flash Back : కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతాయి. వాటిని గుర్తుకు తెచ్చుకుంటే.. ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటి ఘటనే.. టాలీవుడ్ ప్రముఖులు ప్రయాణించే విమానం క్రాష్ ల్యాండింగ్ అవ్వడం. ఆ రోజున ఎంతో మంది సెలబ్రెటీలు ఆ ఫ్లైట్లో ఉన్నారు.
కొన్ని ఘటనలు ఎప్పుడూ మరిచిపోలేం. అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. అలానే చాలా మంది టాలీవుడ్ నటుల జీవితాల్లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఘటన ఒకటి ఉంది. అది గుర్తుకువస్తే.. ఇప్పటికి వామ్మో అనుకుంటారు వాళ్లు. అందులో అంతా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. పండగ కోసం ఇంటికి వచ్చిన వారికి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి చాలా ఏళ్లే అవుతున్నా.. ఇంకా చాలామందికి గుర్తుండిపోయింది.
అది.. ఇండస్ట్రీ చెన్నైలో ఉండేకాలం. షూటింగ్స్.. అక్కడే ఎక్కువగా జరిగేవి. అప్పుడప్పుడే.. హైదరాబాద్ లో టాలీవుడ్ అభివృద్ధి చెందుతోంది. నటులు కూడా అక్కడే ఎక్కువగా ఉండేవారు. ఓ రోజు దీపావళి పండగ వచ్చింది.. ముఖ్యమైన నటులంతా.. ఓ ఫ్లైట్లో పండగ కోసం ఇంటికి వచ్చారు. మెుత్తం 272 మంది ఒకే ఫ్లైట్లో ప్రయాణం. అందులో 60 మంది సినిమా ప్రముఖులు. చాలా ముఖ్యమైన వారు ఉన్నారు. తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పని మీద అదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. అంతమంది ప్రయాణిస్తున్న ఫ్లైట్.. క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
1993 నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. టాలీవుడ్ మాత్రమే.. కాదు.. యావత్ సినిమా ప్రపంచం ఒక్కసారిగా వణికింది. కళ్లు తెరిచేలోపు.. ఫ్లైట్.. క్రాష్ ల్యాండింగ్ అయింది. కానీ అందరూ సేఫ్ గా బయటపడ్డారు. ఈ ఘటనను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు. పొలాల్లో పడిన తర్వాత కూడా.. అందరూ బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం.. ఉదయం 6 గంటల సమయంలో బయల్దేరింది. ఇందులో టాలీవుడ్ కు చెందిన 64 మంది సినీ ప్రముఖులు ఉన్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, సుధాకర్, దర్శకుడు బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇలా చాలా మంది ప్రముఖులు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై టూ హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు. విమానం గాలిలో ఉంది. హైదరాబాద్ లో ల్యాండింగ్ కావాలి. వాతావరణం సహకరించక.. గాలిలోనే తిరిగింది. పైనే చక్కర్లు కొడుతుండగా.. ఇంధనం లోపం కూడా సంభవించింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ల్యాండింగ్ సమయంలో కాస్త అటు ఇటు అయినా.. పెద్ద ప్రమాదమే జరిగింది. తడిగా ఉన్న పంట పొలాల్లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన ముందే.. ఓ పెద్ద బండ రాయి ఉంది. మరికాస్త ముందుకు వెళితే.. చెరువు ఉంది.
కెప్టెన్ భల్లా, కో పైలేట్ వేల్ రాజ్.. సమయ స్ఫూర్తితో ల్యాండింగ్ చేశారు. అయితే అక్కడ వచ్చిన జనాలంతా మెుదట చూసి.. ఏదో సినిమా షూటింగ్ అనుకున్నారట. అప్పుడు సెల్ ఫోన్లు కూడా సరిగా అందుబాటులో లేవు. అందరూ పొలాల్లో నుంచి బయటకు వచ్చి.. సమాచారం చేరవేశారు.
ఈ ఫ్లైట్ ల్యాండింగ్ గురించి.. విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఆ రోజు దీపావళి కోసం వస్తున్నాం. ల్యాండింగ్ చేసేందుకు అవకాశం లేక.. గాలిలోనే తిప్పారు. ఇంధనం అయిపోయింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేశారు. కొంచెం ముందుకు ల్యాండ్ అయి ఉంటే.. ఓ పెద్ద బండరాయికి తగిలేది. విమానం నుంచి పంట పొలాల్లోకి కిందకు దూకాం. చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం.' అని విజయ శాంతి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.