nagarjuna-akhil akkineni: గాడ్‌ఫాదర్ డైరెక్టర్‌తో అక్కినేని హీరోల మల్టీస్టారర్
అక్కినేని ఫ్యామిలీ నుండి మరో మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. నాగార్జున,అఖిల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
సీజన్స్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అందులోనూ అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాలంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని హీరోలందరి కలయికలో రూపొందిన మనం సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తర్వాత బంగార్రాజులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. తన ఇద్దరు తనయుల్లో నాగచైతన్యతోనే రెండు సినిమాలు చేశాడు నాగార్జున. నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ లో గెస్ట్ గా కనిపించాడు. అఖిల్ హీరోగా మారిన తర్వాత అతడితో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు.
తొలిసారి నాగ్, అఖిల్ కాంబినేషన్ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తండ్రీకొడుకుల కలయికలో ఓ సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిరంజీవితో గాడ్‌ఫాదర్ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మోహన్‌రాజా ఈ అక్కినేని మల్టీస్టారర్ కు డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. నాగార్జున, అఖిల్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మోహన్ రాజా ఓ పవర్ ఫుల్ స్ర్కిప్ట్ ను రెడీ చేసినట్లు తెలిసింది. కథ, తమ క్యారెక్టరైజేషన్స్ నచ్చడంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున మల్టీస్టారర్ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆగస్ట్ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకిరానున్నట్లు తెలిసింది. తొలుత నాగార్జున క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కిస్తారని అంటున్నారు. సెప్టెంబర్ నుండి అఖిల్ ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్నట్లు చెబుతున్నారు.
నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఏజెంట్ సినిమా షూటింగ్ తో అఖిల్ బిజీగా ఉన్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలుత ఆగస్ట్ లో రిలీజ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న గాడ్‌ఫాదర్ సినిమా దసరాకు రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం