Vikram Thangalaan Movie: మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన విక్రమ్ - 61వ సినిమా టైటిల్ రివీల్
Vikram Thangalaan Movie: హీరో విక్రమ్ 61వ సినిమా టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నారు.
Vikram Thangalaan Movie: హీరో విక్రమ్, దర్శకుడు పా రంజిత్ కలయికలో రూపొందుతోన్న పీరియాడిక్ సినిమా టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశారు. టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. కబాలి, కాలా సినిమాలతో కోలీవుడ్‌లో వినూత్న కథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు పా రంజిత్ (PA ranjith). సమాజంలో అట్టడుగు వర్గాల వారి సమస్యలను కమర్షియల్ పంథాలో తన సినిమాల్లో ఆవిష్కరిస్తుంటాడు పా రంజిత్.
ప్రస్తుతం విక్రమ్‌తో అతడు ఓ పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు తాంగలాన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు టీజర్‌ను ఆదివారం విడుదలచేశారు. బ్రిటీషర్లతో పోరాటం చేసే గిరిజన తెగ నాయకుడిగా విక్రమ్ కనిపించబోతున్నట్లు ఫస్ట్‌లుక్ టీజర్‌లో చూపించారు. పొడవైన గడ్డం, ముక్కుకు పోగు ధరించి డిఫరెంట్ లుక్‌లో విక్రమ్‌ను ఈ టీజర్‌లో చూపించారు దర్శకుడు. అటవి ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. టీజర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యథార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. . ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తాంగలాన్ పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తోన్న 61వ సినిమా ఇది.
ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విక్రమ్. హిస్టారికల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా 25 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 450 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.