Garikapati and Mega fans: గరికపాటిపై నాగబాబు సెటైర్.. బ్రాహ్మణ సంఘాలు ఫైర్.. ముదురుతున్న వివాదం
Garikapati and Mega fans: గరికపాటిపై నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముగిసిన వివాదానికి ఆయన తెరలేపారని స్పష్టం చేశారు. మేకప్, అవధానానికి ఎంతో తేడా ఉందని తెలిపారు.
Brahmin Groups attack Nagababu: మెగా ఫ్యాన్స్, గరికపాటి వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై విమర్శలు విసురుతున్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహరావు కొంత అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చిరంజీవి కూడా గరికపాటి వద్దకు వచ్చిన వినయంగా నమస్కరించి, ఆయన ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని, క్షమించమని అడిగారు. అంతటితో వివాదం ముగిసింది.
కానీ మెగా బ్రదర్ నాగబాబు.. గరికపాటి పేరు ప్రస్తావించకుండా ఆయనపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఏ పాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ను చూస్తే ఆపాటి అసూయ గలగడం పరిపాటేనని సెటైరికల్ ట్వీట్ చేశారు. దీంతో నాగబాబు చేసిన ఈ ట్వీట్ నెట్టింట ఫ్యాన్స్ మధ్య వైరానికి దారితీసింది.
గరికపాటి.. చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని మెగా అభిమానులు కోరుతుండగా.. ముగిసిన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన నాగబాబే క్షమాపణలు అడగాలని గరికపాటి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బ్రాహ్మణ సంఘాలు మెగా ఫ్యామిలీ, అభిమానులపై ఫైర్ అవుతున్నారు. అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ.. మేకప్-అవధానం మధ్య ఎంతో తేడా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఇది భ్రమను కలిగించే క్షేత్రం. ఇక్కడ మేకప్-అవధానం మధ్య తేడా లేదు. నిత్య ప్రభోదంతో సమాజానికి వెలుగుల నింపుతున్న ఓ సంప్రదాయ ఆధ్యాత్మిక గురువు, తన నటనతో వ్యాపారం చేయడం మినహా.. సమాజానికి మేలు చేయడం మరిచిపోయిన నటుడి పాపులారిటీని చూసి అసూయ చెందుతారంటే నమ్ముతారా. ఇది ఆకాశంపై ఉమ్మివేయడంతో సమానం." అని రవిరాజు స్పష్టం చేశారు.
నాగబాబు పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై సీరియస్ అయ్యారు రవిరాజు. ఇతరుల కోసం ఫిడేలు వాయించేవ్యక్తి.. తనకు తాను సంగీత విధ్వంసకారుడని చెప్పుకుంటూ ట్విటర్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జరిగింది ఇది..
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే గరికపాటి నరసింహరావు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే తన మాటలను పట్టించుకోకుండా చిరంజీవితో సెల్ఫీలు తీసుకోడానికి ప్రజలు ఆత్రుత చూపించారు. దీంతో అసహనానికి గురైన గరికపాటి.. సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని, లేకపోతే వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. దీంతో చిరు ఫొటోలు దిగడం ఆపేసి.. గరికపాటి వద్దకు వెళ్లీ క్షమించమని కోరారు. ఆయన ప్రసంగాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆసక్తిగా వింటానని కూడా చెప్పారు. ఓ రోజు తన ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు.
సంబంధిత కథనం