2024 Lok Sabha elections : నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నా.. మోదీకే ఓటు!-lokniticsds survey predicts pm modis victory in lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  2024 Lok Sabha Elections : నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నా.. మోదీకే ఓటు!

2024 Lok Sabha elections : నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నా.. మోదీకే ఓటు!

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 08:15 AM IST

Lokniti-CSDS survey 2024 : బీజేపీని నిరుద్యోగం సమస్య వెంటాడుతున్నా.. ప్రధాని మోదీ హ్యాట్రిక్​ విక్టరీ సాధిస్తారని తాజా ఓ సర్వే చెప్పింది. ఇందుకు కారణాలను వివరించింది.

ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ..
ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ.. (PTI)

Lokniti-CSDS survey 2024 : ఇంకొన్ని రోజుల్లో హై-ఓల్టేజ్​ 2024 లోక్​సభ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. అయితే.. ఈ దఫా ఎన్నికల్లోనూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వలోని ఎన్​డీఏ కూటమి గెలుస్తుందని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లోక్​నీతి- సీఎస్​డీఎస్​ సర్వే కూడా ఇదే చెబుతోంది. నిరుద్యోగ సమస్యలు వెంటాడుతున్నా.. మోదీ గెలుపు ఖాయమని స్పష్టం చేసింది.

2024 లోక్​సభ ఎన్నికల సర్వే హైలైట్స్​..

దేశంలోని 19 రాష్ట్రాల్లో.. 10వేల మంది ఓటర్లను సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది లోక్​నీతి- సీఎస్​డీఎస్​. సర్వే ప్రకారం.. 10వేల మందిలో 27శాతం మంది.. నిరుద్యోగం సమస్యపై అసహనం వ్యక్తం చేశారు. 23శాతం మంది.. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. గత ఐదేళ్లల్లో (ప్రధానిగా మోదీ రెండో టర్మ్​) ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారినట్టు 62శాతం మంది అభిప్రాయపడ్డారు.

డేటా ప్రకారం.. నిరుద్యోగ సమస్య బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. 2013/14 లో (మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో).. 4.9శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. 2022/23లో 5.4శాతానికి పెరిగింది. అంతేకాదు.. 2022-23లో నగరాల్లోని 15-29ఏళ్ల యువతలో 16శాతం మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నారు. నాణ్యమైన ఉద్యోగాలు లేకపోవడం, స్కిల్స్​ సరిపోకపోవడం వంటివి ఇందుకు కొన్ని కారణాలు.

2024 Lok Sabha elections BJP : అయినప్పటికీ.. ప్రధాని మోదీ నాయకత్వం, ఆయన ఛరిష్మా, ప్రపంచంలో ఇండియాకు పెరుగుతున్న ఖ్యాతి వంటివి బీజేపీకి పాజిటివ్​ పాయింట్స్​ అని సర్వే పేర్కొంది. వీటితోనే మోదీ హ్యాట్రిక్​ కొడతారని పేర్కొంది.

రామ మందిర నిర్మాణం.. మోదీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద చర్యల్లో ఒకటని 22శాతం మంది అభిప్రాయపడ్డారు. హిందువుల శతాబ్దాల కల అయిన రామ జన్మభూమిలో రామ మందిరాన్ని.. జనవరి 22న ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

రామ మందిర నిర్మాణంతో దేశంలో హిందూ ఐడెటింటిటీ పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న 48శాతం మంది తెలిపారు. కానీ.. ఇండియా అనేది అన్ని మతాల వారిదని, అందరు సమానమే అని 79శాతం మంది అభిప్రాయపడ్డారు.

Modi 2024 Lok Sabha elections : గతేడాది భారత్​ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలు, దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 సదస్సుతో ప్రపంచంలో ఇండియా స్థాయి పెరిగిందని ఓటర్లు భావిస్తున్నట్టు సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా.. ఇండియాకు మెరుగైన గుర్తింపును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి తమకు నచ్చిందని.. సర్వేలో పాల్గొన్న 8శాతం మంది తెలిపారు.

2024 లోక్​సభ ఎన్నికలు..

7 దశల్లో జరగనున్న 2024 లోక్​సభ ఎన్నికలు.. ఏప్రిల్​ 19న మొదలవుతాయి. జూన్​ 4న.. ఫలితాలు వెలువడతాయి. మరి ఈ సర్వేలు చెబుతున్నవి నిజం అవుతుందా? మోదీ హ్యాట్రిక్​ కొడతారా? అన్న ప్రశ్నలకు.. జూన్​ 4తో క్లారిటీ వచ్చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం