BJP Telangana : చివరి నిమిషంలో ఆ ఇద్దరికి షాక్... సంగారెడ్డి,వేములవాడ బీజేపీ అభ్యర్థుల మార్పు
BJP Telangana MLA Candidates 2023 : చివరి నిమిషంలో ఇద్దరు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది బీజేపీ. వేములవాడ, సంగారెడ్డిలో అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
BJP Telangana MLA Candidates 2023: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా… ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ కావటంతో పలువురు అభ్యర్థులకు షాక్ ఇస్తున్నాయి పలు పార్టీలు. ఇక బీజేపీ కూడా సంగారెడ్డి, వేములవాడ అభ్యర్థులను మార్చింది.
వేములవాడ సీటపై చెన్నమనేని వికాస్ రావు ఆశలు పెట్టుకోగా… తుల ఉమ పేరు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే జాబితాలో పేరును ప్రకటించినప్పటికీ… బీఫామ్ ను వికాస్ రావుకే కేటాయించింది భారతీయ జనతా పార్టీ. దీంతో తుల ఉమకు గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఇక సంగారెడ్డి విషయానికొస్తే దేశ్ పాండే రాజేశ్వరరావును అభ్యర్ధిగా ప్రకటించగా… పులిమామిడి రాజుకు బీ ఫాం ఇచ్చింది బీజేపీ. దీంతో కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిన దేశ్ పాండే రాజేశ్వరరావు… తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.
తుల ఉమ ఫైర్…
చివరి నిమిషంలో బీఫామ్ దక్కకపోవటంతో తుల ఉమ కన్నీరుమున్నీరు అయ్యారు. మహిళా రిజర్వేషన్‌కు అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజల కోసం పని చెసేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. “విప్లవ ఉద్యమంలో పనిచేయడమే తప్పా..? బిసిలకి, మహిళలకి ప్రాధాన్యత లేదా..? అభ్యర్థిని మార్చుతున్నామని… కనీసం సమాచారం ఇవ్వలేదు. సర్వేలు నాకే అనుకూలంగా ఉన్నాయన్నారు. నాకు బీ ఫామ్ ఇవ్వకపోతే బీజేపీ… బీసీ వ్యతిరేక పార్టీ అవుతుంది. వేములవాడలో ఖచ్చితంగా బరిలో ఉంటాను. దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడాను.. కాబట్టే నాకు టికెట్ ఇవ్వలేదు” అని తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.