India vs Nepal Asian Games: యశస్వి మెరుపు సెంచరీ.. నేపాల్‌పై ఇండియా భారీ స్కోరు
India vs Nepal Asian Games: యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీ చేశాడు. దీంతో నేపాల్‌పై ఇండియా భారీ స్కోరు సాధించింది. ఏషియన్ గేమ్స్ లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయి.
India vs Nepal Asian Games: యశస్వి జైస్వాల్ మరోసారి చెలరేగిపోయాడు. ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివర్లో శివమ్ దూబె, రింకు సింగ్ కూడా చెలరేగారు. దీంతో నేపాల్ పై ఇండియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేయడం విశేషం. రింకు సింగ్ 14 బంతుల్లోనే 35, శివమ్ దూబె 19 బంతుల్లోనే 25 రన్స్ చేసి అజేయంగా నిలిచారు.
నేపాల్ తో మ్యాచ్ లో యశస్వి, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇండియాకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు కేవలం 9.5 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. ఈ సమయంలో 23 బంతుల్లో 25 పరుగులు చేసిన రుతురాజ్ ఔటయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5) కూడా ఔటవడంతో 119 పరుగులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయింది.
తిరుగులేని యశస్వి
ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. యశస్వి మాత్రం జోరు తగ్గించలేదు. నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయితే ఆ వెంటనే ఔటయ్యాడు. చివరికి 49 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతని ఇన్నింగ్స్ లో కేవలం ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే 74 పరుగులు రావడం విశేషం.
ఇక యశస్వి ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె, రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఐదో వికెట్ కు ఇద్దరూ కలిసి అజేయంగా 22 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. రింకు సింగ్ కేవలం 14 బంతుల్లోనే 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 35 రన్స్ చేయగా.. శివమ్ దూబె 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 19 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు.