AFG vs SA: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్ - సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ కైవసం - బర్త్‌డే రోజు రషీద్ ఖాన్ సంచలనం
AFG vs SA: వన్డేల్లో పసికూన అఫ్గానిస్థాన్ మరో అరుదైన రికార్డ్‌ను నెలకొల్పింది. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. షార్జా వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది.
క్రికెట్‌లో పసికూన అఫ్గానిస్థాన్ చరిత్రను సృష్టించింది. తొలిసారి సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ను నెగ్గింది. షార్జా వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికాపై అఫ్గానిస్థాన్ రికార్డ్ విజయాన్ని సాధించింది.
177 పరుగులతో తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండు వన్డేల్లో గెలిచిన అఫ్గానిస్థాన్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్నది.
గుర్భాజ్ సెంచరీ...
శుక్రవారం జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ యాభై ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 311 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 110 బాల్స్‌లో పదిఫోర్లు, మూడు సిక్సర్లతో105 పరుగుల చేశాడు.
అజ్మతుల్లా దంచికొట్టడంతో అఫ్గానిస్థాన్ భారీ స్కోరు చేసింది. అజ్మతుల్లా యాభై బాల్స్‌లో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రహ్మత్ (66బాల్స్‌లో 50 రన్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
134 పరుగులకు ఆలౌట్...
312 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా 34. 2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జార్జి 31, మార్‌క్రమ్ 21 పరుగులు చేశారు. సౌతాఫ్రికా చివరి ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్ స్కోరుకు ఔటయ్యారు. 29 పరుగులు వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్‌ఖాన్ ఐదు, ఖరోట్ నాలుగు వికెట్లు తీసుకున్నారు. రషీద్ ఖాన్ స్పిన్ ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ విలవిలలాడారు. శుక్రవారం నాటితో 26 ఏళ్లలోకి అడుగుపెట్టిన రషీద్‌ఖాన్ తన బర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసి అఫ్గానిస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బౌలింగ్ పరంగా వన్డేల్లో రషీద్ ఖాన్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
కోహ్లి రికార్డ్ సమం...
ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రహ్మతుల్లా గుర్భాజ్...టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లి రికార్డ్‌ను సమం చేశాడు. 23 ఏళ్ల వయసులోపే వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లితో పాటు సమంగా నిలిచాడు. వన్డేల్లో గుర్భాజ్‌కు ఇది ఏడో సెంచరీ. అఫ్గానిస్థాన్ టీమ్ తరఫున ఎక్కువ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా గుర్భాజ్ నిలిచాడు.
అతి పెద్ద గెలుపు...
వన్డేల్లో అఫ్గానిస్థాన్‌కు ఇదే అతి పెద్ద గెలుపు. 2018లో జింబాబ్వేపై 154 పరుగులతో విజయం సాధించింది. ఆ రికార్డ్‌ను సౌతాఫ్రికా మ్యాచ్‌తో అఫ్గానిస్థాన్ తిరగరాసింది.
టాపిక్