BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ‘బ్యాన్‍’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం-supreme court to hear cases challenging ban on bbc documentary on pm modi next week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bbc Documentary On Modi: బీబీసీ డాక్యుమెంటరీ ‘బ్యాన్‍’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ‘బ్యాన్‍’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 30, 2023 04:09 PM IST

BBC Documentary on Modi - Supreme court: బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం విధించిన బ్యాన్‍ అంశం గురించి దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. వచ్చే వారం వాదనలకు విననుంది.

BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ‘బ్యాన్‍’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ‘బ్యాన్‍’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం (ANI Photo)

BBC Documentary on Modi - Supreme court: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (BBC Documentary)ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అభ్యర్థనలపై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకారం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం (ఫిబ్రవరి 6).. దేశ అత్యున్నత న్యాయస్థానం.. వీటిపై విచారణ జరపనుంది.

BBC Documentary on Modi - Supreme court: బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్ (India: The Modi Question)’ నిషేధం అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud), జడ్జిలు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం దీన్ని పరిగణనలోకి తీసుకుంది.

శర్మతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

ఎమర్జెన్సీలా..

BBC Documentary on Modi - Supreme court: దేశ ఎమర్జెన్సీ సమయంలో అమలు చేయాల్సిన ఐటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిందని అడ్వకేట్ సీయూ సింగ్ పేర్కొన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్‍లను సోషల్ మీడియాలో తొలగించిందని, ఎన్.రామ్, ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కూడా తొలగించేలా చేసిందని తెలిపారు. డాక్యుమెంటరీ నిషేధానికి సంబంధించి అధికారిక ఆదేశాలను కేంద్రం వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ నిర్వహించకుండా అజ్మీర్‌లో కళాశాల విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకుందని పేర్కొన్నారు.

ఈ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం, దుర్మార్గం, ఏకపక్షం అని పిల్‍లో పేర్కొన్నారు శర్మ.

కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు

BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీపై బ్యాన్‍ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేయడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయస్థానం సమయాన్ని వృథా చేయడమేనని అన్నారు. “గౌరవనీయమైన సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వారు ఈ విధంగా వృథా చేస్తున్నారు. వేలాది మంది సామాన్య పౌరులు విచారణ తేదీలు, న్యాయం కోసం వేచిచూస్తున్నారు” అని రిజిజు ట్వీట్ చేశారు.

BBC Documentary on Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై ఇండియా: మోదీ క్వశ్చన్ పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‍ను బీబీసీ రూపొందించింది. తొలి భాగం ప్రసారమైన తర్వాత ఈ డాక్యుమెంటరీని నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీపై పోస్ట్ అయిన సుమారు 50 ట్వీట్లను ట్విట్టర్ డిలీట్ చేసిందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. దుష్ప్రచారంలో భాగమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వలసవాద మనస్తత్వం, పక్షపాత ధోరణిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది.

BBC Documentary on Modi: కేంద్రం నిషేధించినా.. కొన్ని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ నిర్వహించాయి. ఈ తరుణంలో కొన్ని యూనివర్సిటీల్లో ఉద్రిక్తత సైతం నెలకొంది. క్యాంపస్‍ల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత, ఇంటర్నెట్ కట్ లాంటివి జరిగాయి. అయితే, కొందరు విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‍టాప్‍ల్లోనూ ఈ బీబీసీ డాక్యుమెంటరీని చూశారు.

Whats_app_banner

సంబంధిత కథనం