BBC Documentary on Modi: జేఎన్‍యూ క్యాంపస్‍లో కరెంట్ కట్.. విద్యార్థులపై రాళ్ల దాడి!
Jawaharlal Nehru University (JNU): జేఎన్‍యూ క్యాంపస్‍లో ఉద్రిక్తత నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ సందర్భంగా పవర్‌కట్ చేశారని, కొందరు తమపై రాళ్ల దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. పూర్తి వివరాలివే..
JNU Incident: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ (BBC Documentary on Modi) అంశం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (Jawaharlal Nehru University - JNU)లో దుమారం రేపింది. ఈ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేయాలని కొందరు విద్యార్థులు బుధవారం ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ సమయంలో క్యాంపస్‍లో విద్యుత్ కట్ అయింది. ఇంటర్నెట్ కూడా నిలిచిపోయింది. అనంతరం ల్యాప్‍టాప్‍లు, మొబైళ్లలో కొందరు విద్యార్థులు ఆ డాక్యుమెంటరీని చూశారు. ఆ సమయంలోనే ఉద్రిక్తతత నెలకొందని తెలుస్తోంది. వివరాలివే..
‘రాళ్లు విసిరారు!’
బీబీసీ డాక్యుమెంటరీ (BBC Documentary) లింక్‍లను షేర్ చేసుకొని.. ఫోన్లు, ల్యాప్‍టాప్‍లలో చూస్తున్న తమపై కొందరు రాళ్ల దాడి చేశారని కొందరు విద్యార్థులు చెప్పారు. ఏబీవీపీకి చెందిన స్టూడెంట్లు తమపై రాళ్లు విసిరారని ఆరోపించారు. “విద్యార్థుల క్షేమం కోసం మేమంతా మెయిన్ గేట్ వద్దకు వచ్చాం. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని అడిగాం. పోలీసులు మా కాల్స్‌కు స్పందించలేదు” అని స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు ఎన్ సాయి బాలాజీ చెప్పారు. కాగా, లింక్ కోసం కొందరు విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరీ ఈ డాక్యుమెంటరీని చూశారు. బుధవారం ఈ డాక్యుమెంటరీ రెండో భాగం ప్రసారమైంది.
హైదరాబాద్ యూనివర్సిటీలో..
హైదరాబాద్ యూనివర్సిటీ (Hyderabad University) లో కూడా కొందరు విద్యార్థులు ఈ వివాదాస్పద బీసీసీ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేశారు. కొందరు విద్యార్థులు క్యాంపస్‍లో కలిసి డాక్యుమెంటరీని చూశారు. దీనిపై వివరణ ఇవ్వాలని తమ అధికారులను నివేదిక కోరింది హైదరాబాద్ యూనివర్సిటీ. సెక్యూరిటీ టీమ్, డీన్ అడిగినా డాక్యుమెంటరీ స్క్రీనింగ్‍ను నిర్వాహకులు ఆపలేదని, కొందరు విద్యార్థులు కూడా హాజరయ్యారని హైదరాబాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్ల అంశాలపై ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ ఓ డాక్యుమెంటరీ సిరీస్‍ను రూపొందించింది. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అసత్యాలు, పక్షపాతం, వలసవాద ధోరణితో ఈ డాక్యుమెంటరీని రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు ఈ డాక్యుమెంటరీని వినియోగించుకుంటోందంటూ ఆరోపించింది.
దేశంలో ఆ వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ డాక్యుమెంటరీని స్ట్రీమ్ చేయకూడదని యూట్యూబ్, ట్విట్టర్ తో పాటు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు మాత్రం లింక్‍లను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా మరికొన్ని ప్రతిపక్షాలు మాత్రం డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నిజాన్ని దాచలేరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ అంశంపై వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం