Reliance: సబ్బుల విషయంలోనూ రిలయన్స్ ధరల యుద్ధం!: తక్కువ రేట్లతో ఎంట్రీ
Reliance - RCPL Products: సబ్బుల విషయంలోనూ ధరల యుద్ధానికి రిలయన్స్ తెరతీస్తోంది. తక్కువ ధరకే సోప్‍లను మార్కెట్‍లోకి తీసుకొస్తోంది.
Reliance - RCPL Products: కంపాను రీలాంచ్ చేసి సాఫ్ట్ డ్రింక్స్ విభాగంలో ఇటీవలే ధరల యుద్ధాన్ని తీసుకొచ్చింది ప్రముఖ సంస్థ రిలయన్స్ (Reliance). తాజాగా సబ్బుల విషయంలో ఇదే జరుగుతోంది. ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇటీవలే ఎఫ్‍ఎంసీజీ(FMCG)లోని పర్సనల్, హోమ్ కేర్ సెగ్మెంట్‍లోకి ఇటీవలే అడుగుపెట్టింది. 30 నుంచి 35 శాతం తక్కువ ధరతోనే సబ్బులతో పాటు మరిన్ని ప్రొడక్టులను తెచ్చేందుకు రిలయన్స్ సిద్ధమైంది. వివరాలివే..
రిలయన్స్ తక్కువ ధరకే సబ్బులను తీసుకువస్తుండటంతో చాలా మంది కస్టమర్లు వాటిని ట్రై చేసి.. నాణ్యత, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో పరిశీలిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉన్న బ్రాండ్‍లతో పోలిస్తే రిలయన్స్ సోప్స్ ఎలా ఉన్నాయో పోల్చుకుంటారని అంటున్నారు.
దేశమంతా డీలర్ నెట్‍వర్క్
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) పరిధిలో ఆర్సీపీఎల్ (రిలయన్స్ కన్య్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ - RCPL) ఉంది. ఇటీవలే క్రమంగా ప్రొడక్టులను RCPL తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఆర్సీపీఎల్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే, త్వరలోనే దేశమంతా డీలర్ నెట్‍వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రొడక్టులను దేశమంతా విక్రయించాలని ఆర్సీపీఎల్ ప్లాన్ చేస్తోంది.
రూ.25కే సబ్బులు
Reliance Soaps: గ్లిమ్మర్ బ్యూటీ బాత్ సోప్స్, గెట్ రియల్ నేచురల్ సోప్స్, ప్యూరిక్ హైజెనిక్ (100 గ్రాములు) బాతింగ్ సోప్‍లను రూ.25లకే రిలయన్స్‌కు చెందిన ఆర్సీపీఎల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇతర బ్రాండ్ల నుంచి ఉన్న సబ్బుల కంటే వీటి ధర తక్కువగా ఉంది. ప్రస్తుతం లక్స్ సబ్బు ధర రూ.35(100 గ్రాములు), డెటాల్ సోప్ రేటు రూ.40 (75 గ్రాములు), సంతూర్ ధర రూ.34 (100 గ్రాములు)గా ఉంది. ఇతర ప్రముఖ బ్రాండ్‍ల సోప్‍ల రేట్లు కూడా రూ.30 (75 గ్రాముల కంటే ఎక్కువ)కి పైగానే ఉన్నాయి.
ఇక ఎన్‍జో (Enzo) 2 లీటర్ల ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ లిక్విడ్ డిటర్జంట్ ధరను రూ.250గా ఆర్సీపీఎల్ నిర్ణయించింది. 1-లీటర్ ధర రూ.149గా ఉంది. ప్రస్తుతం ఉన్న ఇతర ప్రముఖ బ్రాండ్ల వాటి కంటే వీటి ధరలు సుమారు 40 శాతం వరకు తక్కువగా ఉన్నాయి.
డిష్‍వాష్ విభాగంలో కూడా RCPL తక్కువ ధరలోనే ప్రొడక్టులను తీసుకువస్తోంది. ఎన్‍జో డిష్‍వాష్ సోప్‍ల ధరలు రూ.5 నుంచి మొదలుకొని రూ.15 వరకు ఉన్నాయి. లిక్విడ్ జెల్ ప్యాక్స్ ధరలు రూ.10, రూ.30, రూ.45గా ఉన్నాయి. ఎన్‍జో డిటర్జెంట్ సోప్‍ల ధరలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఈనెల ప్రారంభంలో కంపా సాఫ్ట్ డ్రింక్‍ను ఆర్సీపీఎల్ రీలాంచ్ చేసింది. 200 మిల్లీలీటర్ల బాటిల్ ధరను రూ.10గా, 500 మిల్లీలీటర్ల బాటిల్ ధరను రూ.20గా నిర్ణయించింది. తక్కువ ధరతో.. ప్రముఖ కంపెనీలు పెప్సికో, కోకా కోలాకు గట్టిపోటీని ఇవ్వాలని రిలయన్స్ డిసైడ్ చేసుకుంది. ధరల యుద్ధాన్ని మొదలుపెట్టింది.