కేవలం 6 సెకెండ్లలో బ్యాటరీ మార్చుకోవచ్చు.. రిలయన్స్ ఆవిష్కరణ
ఎలక్ట్రిక్ వాహనాల శకంలో రిలయన్స్ మరొక కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స్వాప్ చేయగల బ్యాటరీల కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోతో పాటు నిర్వహిస్తున్న 'ది బ్యాటరీ షో ఇండియా' మొదటి ఎడిషన్ సందర్భంగా ఈ ఆవిష్కరణను ప్రదర్శించింది.
ఈ కాన్సెప్ట్ ఇప్పటికే ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ దశకు చేరుకుందని, వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని రిలయన్స్ స్టాల్‌లోని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
ఈ బ్యాటరీలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 70-75 కిలోమీటర్లు నడపడానికి తగినంత శక్తిని అందిస్తాయి. ‘ఈ స్వాప్ చేయ గల బ్యాటరీలను సౌరశక్తిని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. వినియోగదారులు గృహోపకరణాలకు కూడా వీటిని ఉపయోగించవచ్చు’ అని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.
‘వినియోగదారుడు ఛార్జింగ్ అయిపోగానే దానిని వెంటనే మార్చుకోవచ్చు. డాక్, ఛార్జర్‌ని ఉపయోగించి ఇల్లు లేదా కార్యాలయంలో మార్చుకోవచ్చు. ఇక ఈవీ స్టేషన్లలో తమ ద్విచక్ర వాహనాలు తీసుకొచ్చి ఛార్జ్ అయిపోయిన బ్యాటరీ ఇచ్చేసి, ఛార్జ్ అయిన బ్యాటరీని పొందవచ్చు.. సాంకేతికంగా మార్పిడి సమయం కేవలం ఆరు సెకన్లు మాత్రమే..’ అని ఆ అధికారి వివరించారు.
రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్‌లో సోలార్ ప్యానెల్‌లు, మీటర్లు, ఇన్వర్టర్, క్లౌడ్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయని అధికారి తెలిపారు. మార్పిడి చేయగల బ్యాటరీలు పర్యావరణ వ్యవస్థను ఉపయోగించి గృహోపకరణాలకు శక్తినివ్వడానికి కూడా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఒకే మొబైల్ ఫోన్ అప్లికేషన్ ఉపయోగించి అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చని ఆయన చెప్పారు.
‘ద్విచక్ర వాహనాల కోసం ఆటోమేటెడ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (ఓఈ) తయారీదారులతో కలిసి పని చేస్తున్నాం. వారు ఈ బ్యాటరీలకు అనుకూలమైన మోడళ్లను అభివృద్ధి చేస్తారు..’ అని వివరించారు.