Income tax deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..
Income tax deductions: ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గరపడుతోంది. మరో నాలుగురోజుల్లో ఈ గడువు ముగుస్తుంది. జులై 31 లోపు ఐటీఆర్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ముందుగా ఈ పన్ను మొత్తాన్ని తగ్గించే ఈ మినహాయింపుల (deductions) గురించి తెలుసుకోండి.
Income tax deductions: ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2023. ఈ గడువును పొడిగించే ఆలోచన లేదని ఆదాయ పన్ను శాఖ చెబుతోంది. మరోవైపు, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న నేపథ్యంలో.. ఈ లాస్ట్ డేట్ ను పొడిగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ మినహాయింపులు ఇంపార్టెంట్
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, పలు పన్ను మినహాయింపులను పొందవచ్చు. అందులో ప్రధానమైనది స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction). ఈ మినహాయింపును సెక్షన్ 80 సీ కింద పొందవచ్చు. ఇది కాకుండా, ఆదాయ పన్ను చట్టంలో ఇంకా చాలా మినహాయింపులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మీ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
- నేషనల్ పెన్షన్ స్కీమ్
నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ(1బీ) (80CCD (1B) కింద రూ. 1.5 లక్షల వరకు ఎన్పీఎస్ పెట్టబడులపై పన్ను ఉండదు.
- సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ
బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న నగదుపై లభించే వడ్డీపై కూడా సెక్షన్ 80 టీటీఏ (80TTA) పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ. 10 వేల వరకు సేవింగ్స్ బ్యాంక్ వడ్డీపై మినహాయింపు ఉంటుంది.
- విద్యా రుణంపై వడ్డీ
ఎడ్యుకేషన్ లోన్ పై చెల్లించే వడ్డీకి కూడా సెక్షన్ 80 ఈ (80E) ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపును మీరు రుణ వాయిదాలు చెల్లిస్తున్న నాటి నుంచి 8 ఏళ్ల పాటు పొందవచ్చు. మీరు, లేదా మీ జీవిత భాగస్వామి, లేదా మీ పిల్లలు, లేదా మీరు చట్టబద్ధంగా గార్డియన్ గా ఉన్నవారు ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణంపై ఈ మినహాయింపు వర్తిస్తుంది.
- విరాళాలపై పన్ను మినహాయింపు..
మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్ కు ఏమైనా విరాళం ఇస్తే, ఆ మొత్తంపై మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్.. ఇలాంటి వాటికి ఇచ్చే డొనేషన్స్ పై 100% పన్ను మినహాయింపు ఉంటుంది. వేరే డొనేషన్స్ పై 50% పన్ను మినహాయింపు ఉంటుంది.
- ముందస్తు ఆరోగ్య పరీక్షలు
ముందస్తు ఆరోగ్య పరీక్షల (Preventive health check-ups) కోసం చెల్లించే మొత్తంపై, గరిష్టంగా రూ. 5 వేల వరకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు, లేదా మీ జీవిత భాగస్వామి, లేదా మీపై ఆధారపడి ఉన్న పిల్లలు, 60 ఏళ్లు లోపు వయస్సున్న మీ పేరెంట్స్ కు హెల్త్ చెకప్స్ కోసం చెల్లించే మొత్తం, గరిష్టంగా రూ. 5 వేల వరకు సెక్షన్ 80 డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. 60 ఏళ్లు లోపు వయస్సున్న మీ పేరెంట్స్ కు హెల్త్ చెకప్స్ కోసం చెల్లించే మొత్తం, గరిష్టంగా రూ. 7 వేల వరకు సెక్షన్ 80 డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఎల్ఐసీ, పీపీఎఫ్ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందవచ్చు.