EV tips: మీ ఎలక్ట్రిక్ కారులో లాంగ్ ట్రిప్ కు వెళ్తున్నారా?.. కారులో ముందు ఇవి చెక్ చేయండి!
EV tips: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. తదనుగుణంగా సేల్స్ పెరిగాయి. అయితే, ఇప్పటికీ ఎలక్ట్రిక్ కారుపై లాంగ్ డ్రైవ్ కు వెళ్లడానికి చాలా మంది భయపడ్తుంటారు. అయితే, ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుని, మీరు హ్యాప్పీగా ీ ఈవీలో లాంగ్ ట్రిప్ కు వెళ్లవచ్చు.
EV tips: ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) ప్రజాదరణ పెరుగుతోంది. ఈవీల సేల్స్ కూడా గణనీయంగా ఉంటున్నాయి. దాంతో, హైవేలపై ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈవీలపై దూర ప్రయాణాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, మీ ఈవీ పై లాంగ్ రోడ్ ట్రిప్ ను ప్రారంభించే ముందు, మీ ఈవీ సరైన స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణంలో బ్రేక్ డౌన్ అవకాశాలను తగ్గించడానికి మీరు సులభంగా చేయగలిగే ఐదు ముఖ్యమైన మెకానికల్ తనిఖీలు ఇక్కడ ఉన్నాయి.
బ్యాటరీ హెల్త్ అసెస్ మెంట్
ఛార్జ్ కెపాసిటీ: ట్రిప్ కు ముందు మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉందని నిర్ధారించుకోండి. మీరు ప్రయాణించే దూరం ఆ బ్యాటరీ తో వెళ్లగలమని నిర్ధారించుకోండి.
సెల్ బ్యాలెన్స్: ఒక ఎలక్ట్రిక్ వాహనం (electric cars) సాధారణంగా ఛార్జింగ్ ప్రక్రియ ముగిసే సమయంలో దాని సెల్స్ ను ఆటోమేటిక్ గా బ్యాలన్స్ చేస్తుంది. కాబట్టి, మీరు చేయాల్సిందల్లా మీ వాహనాన్ని 100 శాతం వరకు ఛార్జ్ చేస్తే చాలు. బ్యాటరీలోని సెల్స్ ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతాయి. ఇది బ్యాటరీ ప్యాక్, అందులోని సెల్స్ పనితీరు మెరుగుపడడానికి, అలాగే, దీర్ఘాయువుకు సహాయపడుతుంది.
టైర్ కండిషన్ మరియు ప్రెజర్
ట్రెడ్ డెప్త్: వాహనం యొక్క అత్యంత కీలకమైన భాగాలలో టైర్లు ఒకటి. సరైన పట్టు కోసం టైర్ లో తగినంత ట్రెడ్ డెప్త్ ఉండడం అవసరం, ముఖ్యంగా తడి లేదా జారిపోయే రోడ్లపై ట్రెడ్ డెప్త్ చాలా కీలకం. కాబట్టి టైర్లకు సరిపడా థ్రెడ్ ఉండేలా చూసుకోవాలి. అసమాన థ్రెడ్, ఉబ్బు, బొబ్బలు లేదా సైడ్ వాల్ డ్యామేజ్ ఉన్నప్పుడు టైర్ ను మార్చాలి.
టైర్ ప్రెజర్: టైర్లలో సిఫారసు చేసిన ఎయిర్ ప్రెజర్ ను మెయింటైన్ చేయండి. రహదారులపై సరైన భద్రత కొరకు, మంచి మైలేజీ కొరకు టైర్లలో సరైన స్థాయిల్లో ఎయిర్ ఉండాలి.
వీల్ అలైన్ మెంట్, బ్యాలెన్సింగ్: సరైన అలైన్ మెంట్, టైర్ బ్యాలెన్సింగ్ వాహనం జీవిత కాలాన్ని పెంచుతుంది. టైర్ అరుగుదల, ఇంధన సామర్థ్యం, మొత్తం డ్రైవింగ్ అనుభవాన్ని ఇది గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది డ్రైవర్ పై డ్రైవింగ్ భారాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే, వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉంటే వాహనాన్ని స్థిరంగా ఉంచడానికి డ్రైవర్ నిరంతరం బలాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు.
బ్రేక్ సిస్టమ్ తనిఖీ
బ్రేక్ ప్యాడ్ మందం: ఆకస్మిక బ్రేక్ వైఫల్యాన్ని నివారించడానికి తగినంత బ్రేక్ ప్యాడ్ మెటీరియల్ ఉండేలా చూసుకోండి.
బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్: బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్, క్వాలిటీ చెక్ చేయండి. ఒకవేళ అది గరిష్ట స్థాయిలో లేనట్లయితే దానిని టాప్ అప్ చేయాలి.
రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్: రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును చెక్ చేయండి. ఇది శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది. బ్రేక్ అరుగుదలను తగ్గిస్తుంది. ఇది కిందికి వెళ్ళేటప్పుడు, బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సాధారణంగా బ్యాటరీ 80 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు పనిచేస్తుంది.
కూలింగ్ సిస్టమ్ పనితీరు
కూలెంట్ స్థాయి: ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ లలో కూలెంట్ స్థాయిని తనిఖీ చేయండి. బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారు వేడెక్కకుండా చూసుకోవడమే కూలెంట్ యొక్క ఉద్దేశ్యం.
ఛార్జింగ్ పోర్ట్ మరియు కేబుల్ ఇన్ స్పెక్షన్
పోర్ట్ కండిషన్: ఏదైనా డ్యామేజ్, తుప్పు లేదా లూజ్ కనెక్షన్ ల కొరకు ఛార్జింగ్ పోర్ట్ ని తనిఖీ చేయండి.
కేబుల్ ఫంక్షనాలిటీ: ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పనిచేస్తోందని, అవసరమైన ఛార్జింగ్ వేగాన్ని అందిస్తుందని నిర్ధారించుకోండి.
సుదీర్ఘ EV ట్రిప్ కు ముందు ఈ ముఖ్యమైన తనిఖీలను శ్రద్ధగా చేయడం ద్వారా, మీరు మీ డ్రైవింగ్ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు, ఊహించని బ్రేక్ డౌన్ ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.