iPhone 15 launch: ఈ ఒక్క కారణం వల్లనే 63 శాతం ఐ ఫోన్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారట..
iPhone 15 launch: సెప్టెంబర్ 12న యాపిల్ ఈవెంట్ జరగబోతోంది. ఆ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. రెండు స్మార్ట్ వాచెస్ ను కూడా యాపిల్ లాంచ్ చేస్తోంది.
iPhone 15 launch: ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ట్రేడ్ ఇన్ ప్లాట్ ఫామ్ ‘‘సెల్ సెల్ (SellCell)’’ ఒక సర్వే చేసింది. ప్రస్తుతం ఐ ఫోన్ వినియోగదారుల్లో ఎంత మంది కొత్త ఐ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటున్నారు? అందుకు కారణమేంటి? అన్న ప్రశ్నలతో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
సీ టైప్ చార్జింగ్
ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో యూఎస్బీ సీ టైప్ పోర్ట్ చార్జింగ్ ఫెసిలిటీని అందివ్వబోతున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, ఈ ఒక్క కారణం వల్లనే 63% ఐ ఫోన్ యూజర్లు కొత్త ఐ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటున్నారని ఆ సర్వేలో తేలింది. ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లకు మారాలనుకోవడానికి ప్రధాన కారణం ఆ ఫోన్లలో యూఎస్బీ సీ టైప్ పోర్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉండబోతుండడమే అని 63% ఐ ఫోన్ వినియోగదారులు స్పష్టంగా చెప్పారట. ఐ ఫోన్, మాక్, ఐ పాడ్ లకు ఒకే చార్జింగ్ కేబుల్ ఉండడం అప్ గ్రేడ్ కావడానికి కారణమని 15% ఐ ఫోన్ యూజర్లు చెప్పారట. ఐ ఫోన్ కు ప్రత్యేకంగా చార్జింగ్ కేబుల్ ఉండడం ఇబ్బందికరంగా ఉందని వారు చెప్పారు
ఆండ్రాయిడ్ యూజర్లు కూడా..
యూఎస్బీ సీ టైప్ చార్జింగ్ ఉంటే ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను కొనే విషయం ఆలోచిస్తామని ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నవారిలో 44% చెప్పారు. అలాగే, డేటా ట్రాన్స్ ఫర్ వేగంగా కావడం ఐ ఫోన్ కు మారాలనుకోవడానికి కారణమని 12.63%, చార్జింగ్ వేగంగా కావడం ఐ ఫోన్ కు మారాలనుకోవడానికి కారణమని 12.53%, చార్జర్స్ ను కుటుంబంలోని ఇతరులతో కలిసి వాడుకోవచ్చని 7.2% చెప్పారు. 2012 నుంచి తమ ఫోన్లకు ప్రత్యేక చార్జర్లను యాపిల్ అందజేస్తోంది. తాజాగా యూరోపియన్ యూనియన్ నిబంధనల వల్ల, తొలిసారి ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో యూఎస్బీ సీ చార్జర్లను అందిస్తోంది.
టాపిక్