Used cars Vs New cars: ‘‘పాత కార్లు వద్దు.. కొత్త కార్లే ముద్దు’’ - మారుతున్న భారతీయుల వైఖరి
Global Automotive Consumer Study: 2024 లో భారత్ లో మారుతున్న వాహన వినియోగదారుల ఎంపికలపై డెలాయిట్ కంపెనీ ఒక నివేదిక రూపొందించింది. గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) రూపొందించిన ఆ నివేదిక భారతీయ వాహన వినియోగదారుల్లో వస్తున్న మార్పులను నివేదించింది.
Global Automotive Consumer Study: 2024 గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలో వినియోగదారుల ప్రాధాన్యతలలో మార్పులను వివరించింది. దాదాపు సగం మంది భారతీయ వినియోగదారులు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) టెక్నాలజీ పై ఆసక్తి చూపడం లేదని డెలాయిట్ (Deloitte) నిర్వహించిన ఈ అధ్యయనం సూచిస్తుంది. అదనంగా, 24 శాతం మంది భారతీయ వినియోగదారులు తమ తదుపరి వాహనాల కొనుగోలు కోసం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (HEV) వైపు మొగ్గు చూపుతున్నారు.
రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల
కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే కీలక అంశం ధరేనని మెజారిటీ వినియోగదారులు అభిప్రాయపడ్డారు. 80 శాతం మంది వినియోగదారులు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల ధరల శ్రేణిలో వాహనాలను ఎంచుకుంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఉన్న ఐసీఈ, ఈవీ ఇంజిన్లకు ప్రాధాన్యతలు వరుసగా 59 శాతం, 58 శాతంగా ఉన్నాయి. రూ.10 లక్షల లోపు ధర కలిగిన ఐసీఈ, ఈవీ వాహనాలకు వినియోగదారుల ప్రాధాన్యత వరుసగా 23 శాతం, 22 శాతంగా నమోదైంది.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత
కాలుష్యం వెదజల్లని వాహనాలను కొనుగోలు చేయాలని 68 శాతం వినియోగదారులు భావిస్తున్నారు. 63 శాతం మంది మైలేజీ బాగా ఇచ్చే వాహనాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునేవారు, ముఖ్యంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత గురించి ఆలోచిస్తున్నారు. 66 శాతం మంది తమ వాహనాలను ఇంటి వద్ద చార్జింగ్ చేయాలనుకుంటున్నారు. 22 శాతం మంది మాత్రం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేయాలనుకుంటున్నారు. ఈవీ కస్టమర్లు ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే, వారు ఎక్కువగా క్రెడిట్ / డెబిట్ కార్డు చెల్లింపులకు మొగ్గు చూపుతారు.
బ్యాటరీల ధరలు..
బ్యాటరీ ప్యాక్ ల నిర్వహణ, నాణ్యమైన బ్యాటరీ ప్యాక్ ల అందుబాటు.. మొదలైన విషయాలపై ఈవీ కస్టమర్లు దృష్టి పెడుతున్నారు. అయితే, ఈవీ ల్లో ఛార్జింగ్ సమయం, మౌలిక సదుపాయాల లభ్యత, బ్యాటరీ భద్రత వంటి సవాళ్లు కొనసాగుతున్నాయి. దాంతో, హైబ్రిడ్ టెక్నాలజీకి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
పాత కార్లు వద్దు..
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా, కొత్త వినియోగదారులు పాత కార్ల (USED CARS) కంటే కొత్త కార్లనే కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కొంత ధర ఎక్కువైనా.. అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. యూజ్ డ్ కార్లలో ఉండే పాత టెక్నాలజీని వారు వద్దు అనుకుంటున్నారు. అలాగే, కార్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రత్యేకత చూపుతున్నారు. 83 శాతం మంది వినియోగదారులు సౌలభ్యం మరియు ఖర్చు ఆదా కోసం తయారీదారు నుండి నేరుగా బీమాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.