India festival spending : పండుగ సీజన్​లో.. తెగ ఖర్చు చేసేస్తున్నారు!-india festival spending booms despite inflation worries global slowdown ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India Festival Spending : పండుగ సీజన్​లో.. తెగ ఖర్చు చేసేస్తున్నారు!

India festival spending : పండుగ సీజన్​లో.. తెగ ఖర్చు చేసేస్తున్నారు!

Sharath Chitturi HT Telugu
Oct 14, 2022 11:01 AM IST

India festival spending : పండుగ సీజన్​లో భారతీయులు తెగ ఖర్చు చేసేస్తున్నారు. ఈసారి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

<p>పండుగ సీజన్​ వేళ ఢిల్లీలోని ఓ మార్కెట్​లో రద్దీ</p>
పండుగ సీజన్​ వేళ ఢిల్లీలోని ఓ మార్కెట్​లో రద్దీ (REUTERS)

India festival spending : ప్రపంచ దేశాలను ద్రవ్యోల్బణం భయపెడుతోంది. ఆర్థిక మాంద్యం పేరు వింటేనే ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. కాస్ట్​ కటింగ్​ పేరుతో అనేక సంస్థలు ఇప్పటికే ఉద్యోగాలను కట్​ చేస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితేమీ అంత బాగా లేదు. అయితే.. ఇవేవీ భారతీయులను భయపెడుతున్నట్టు కనిపించడం లేదు! పొదుపు విషయం ఎలా ఉన్నా.. భారతీయులు మాత్రం తెగ ఖర్చు చేసేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పండుగ సీజనే ఇందుకు నిదర్శనం. కార్ల నుంచి ఇళ్ల వరకు.. పర్యటనల నుంచి ఆభరణాల వరకు.. గత నెల నుంచి భారతీయులు విపరీతంగా ఖర్చులు చేస్తున్నారు.

ఆన్​లైన్​.. ఆఫ్​లైన్​..

ఇండియాలో ఆగస్టు 31న.. వినాయక చవితితో ఫెస్టివల్​ సీజన్​ మొదలైంది. దసరా, దీపావళి, ఛత్​ పూజ.. ఇలా నవంబర్​ మొదటి వారం వరకు పండుగ సీజన్​ నడుస్తుంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం.. ఇండియాలో ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ సేల్స్​ విలువ 27బిలియన్​ డాలర్లను దాటిపోయింది. ప్రీ కొవిడ్​ దశ(2019)తో పోల్చుకుంటే.. ఇది రెండింతలు ఎక్కువ. గతేడాదితో పోల్చుకుంటే ఇది 25శాతం అధికం.

India festival spending estimations : సీఏఐటీ(కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా ట్రేడర్స్​) ప్రకారం.. ఈ మొత్తంలో ఆఫ్​లైన్​ సేల్స్​ విలువ 15.2బిలియన్​ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. 2019లో ఇది కేవలం 8.5బిలియన్​ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇక అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తో పాటు ఇతర ఆన్​లైన్​ వేదికల్లో ఈ ఏడాది 11.8బిలియన్​ డాలర్ల సేల్స్​ జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

అక్టోబర్​లో రీటైల్​ సేల్స్​ పీక్​ దశలో ఉంటాయి. దసరా, దీపావళి అంటూ ప్రజలు భారీగా షాపింగ్​లు చేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం, ఉద్యోగాల్లో జీతాలు పెరుగుతుండటంతో భారతీయులు ఖర్చులను పెంచినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

"కొవిడ్​ వల్ల రెండేళ్లు విధ్వంసం జరిగింది. ఆ తర్వాత ఈ పండుగ సీజన్​లో పరిస్థితులు బాగున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ పండుగ సీజన్​ తొలి వారంలోనే ఆన్​లైన్​ సేల్స్​ ఐదొవ వంతు పెరిగాయి," అని రెడ్​సీర్​లో అసోసియేట్​ పార్ట్​నర్​ సంజయ్​ కొతారి తెలిపారు.

Festival sales 2022 : 2018 నుంచి ఆన్​లైన్​ కొనుగోళ్లు నాలుగింతలు పెరిగాయి. మొబైల్​ ఫోన్​లు, ఫ్యాషన్​కు సంబంధించిన వస్తువులకు డిమాండ్​ విపరీతంగా పెరిగింది. చిన్న పట్టణాల నుంచి ప్రధాన నగరాల వరకు.. డిమాండ్​ ఊహించినదాని కన్నా ఎక్కువగా ఉంది.

ఢిల్లీ, ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, కేరళతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు సానుకూలంగా సేల్స్​ చేస్తున్నారు. వ్యాపారానికి డిమాండ్​ విపరీతంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఫలితంగా గ్రామీణ భారతంలో డిమాండ్​ తక్కువగా కనిపిస్తోంది.

ద్రవ్యోల్బణం భయాలు ఉన్నా..

Recession news latest : గతేడాదితో పోల్చుకుంటే.. ఈ నెల 9 రోజుల పండుగ సీజన్​లో.. ఆటో సేల్స్​ 57శాతం పెరిగాయి. 2019తో పోల్చుకుంటే ఇది ఇంకా ఎక్కువగా ఉందని ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసొసియేషన్స్​ చెప్పింది.

వాహనాల ధరల పెంపు, ఇంధన ధరలు వ్యవహారం సమస్యాత్మకంగా ఉన్నా.. ఆటో సేల్స్​ జోరుగా సాగుతుండటం విశేషం.

దేశంలోని టాప్​ 7 నగరాల్లో.. ఇళ్ల కొనుగోళ్లు 70శాతం (గతేడాదితో పోల్చుకుంటే) పెరిగినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.

అంచనాల్లో ఉన్న అంకెలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్​ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ద్రవ్యోల్బణం పీక్స్​లో ఉంది. దానిని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి కేంద్ర బ్యాంకులు. ఫలితంగా ఆర్థిక మాంద్యం వస్తుందని భయాలు ఉన్నాయి. గ్లోబల్​ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు పాత్ర పోషిస్తున్న దేశాలన్నీ.. వచ్చే ఏడాదిలో ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదిక హెచ్చరించింది.

ఇండియాలో కూడా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది ఆర్​బీఐ. మే నుంచి ఇప్పటివకు 150 బేసిస్​ పాయింట్లు పెరిగాయి. సెప్టెంబర్​లో ద్రవ్యోల్బణం 7.41శాతంగా ఉంది. ఇది ఐదు నెలల గరిష్ఠం. ఇవేవీ.. భారతీయులను భయపెట్టడం లేదు.

ద్రవ్యోల్బణం పీక్​ స్టేజీ దాటిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా సేల్స్​ పెరుగుతుంటే.. ప్రభుత్వానికి కూడా మంచిదే! జీఎస్​టీ కలెక్షన్లు దండిగా వచ్చి చేరుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం