Binny Bansal leaves Flipkart: ఫ్లిప్ కార్ట్ బోర్డు నుంచి వైదొలగిన సంస్థ ఫౌండర్ బిన్నీ బన్సాల్-founder binny bansal steps down from flipkart board ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Binny Bansal Leaves Flipkart: ఫ్లిప్ కార్ట్ బోర్డు నుంచి వైదొలగిన సంస్థ ఫౌండర్ బిన్నీ బన్సాల్

Binny Bansal leaves Flipkart: ఫ్లిప్ కార్ట్ బోర్డు నుంచి వైదొలగిన సంస్థ ఫౌండర్ బిన్నీ బన్సాల్

HT Telugu Desk HT Telugu
Jan 27, 2024 02:45 PM IST

Binny Bansal leaves Flipkart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బోర్డ్ నుంచి ఆ సంస్థను స్థాపించిన బిన్నీ బన్సాల్ వైదొలగారు.బెంగళూరుకు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను 2007లో బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ లు స్థాపించారు.

ఫ్లిప్ కార్ట్ ఫౌండర్ బిన్నీ బన్సాల్
ఫ్లిప్ కార్ట్ ఫౌండర్ బిన్నీ బన్సాల్

Binny Bansal leaves Flipkart: 2007లో తాను, సచిన్ బన్సాల్ కలిసి స్థాపించిన ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మేనేజ్ మెంట్ బోర్డ్ నుంచి వైదొలగుతున్నట్లు బిన్నీ బన్సాల్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బిన్నీ బన్సాల్ నిష్క్రమణతో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆ సంస్థ ను స్థాపించిన ఇద్దరు బయటకు వెళ్లినట్లు అయింది.

ఫ్లిప్ కార్ట్ బలంగా ఉంది..

'గత 16 ఏళ్లలో ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సాధించిన విజయాలకు నేను గర్వపడుతున్నాను. ఫ్లిప్ కార్ట్ చాలా బలమైన స్థితిలో ఉంది. బలమైన నాయకత్వ బృందం, స్పష్టమైన లక్ష్యం ఉంది. కంపెనీ సమర్థులైన వ్యక్తుల చేతుల్లో ఉందని తెలిసి, కంపెనీ భవిష్యత్తుపై విశ్వాసంతో వైదొలగాలని నేను నిర్ణయించుకున్నాను. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో వస్తున్న ఫ్లిప్ కార్ట్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని బన్సాల్ శనివారం విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ మధ్య కాలంలోనే ఫ్లిప్ కార్ట్ లోని తన మొత్తం వాటాలను బిన్నీ బన్సాల్ విక్రయించారు.

‘నవీ’ రూపకల్పనలో..

బిన్నీ బన్సాల్ తో కలిసి ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించిన సచిన్ బన్సాల్ 2018 లో సంస్థ నుంచి వైదొలగారు. ఈ కామర్స్ దిగ్గజం వాల్ మార్ట్ (Walmart) ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసే సమయంలో సచిన్ బన్సాల్ సంస్థ నుంచి వైదొలగారు. ప్రస్తుతం సచిన్ బన్సాల్ తాను ఇటీవలనే ప్రారంభించిన ‘నవీ (Navi) స్టార్టప్ ను విజయవంతం చేసే పనిలో ఉన్నారు. నవీ ఫిన్ టెక్ స్టార్ట్ అప్ (fintech startup).

ఫ్లిప్ కార్ట్ స్పందన

బిన్నీ బన్సాల్ నిష్క్రమణపై ఫ్లిప్ కార్ట్ సిఇఒ మరియు బోర్డు సభ్యుడు కళ్యాణ్ కృష్ణమూర్తి స్పందించారు. ‘‘ఫ్లిప్ కార్ట్ లో బిన్నీ భాగస్వామ్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతని అనుభవం, వ్యాపారంలో ఉన్న లోతైన నైపుణ్యం ఫ్లిప్ కార్ట్ కు అమూల్యమైనవి. ఫ్లిప్ కార్ట్ అనేది ఒక గొప్ప ఆలోచన, చాలా కృషి ఫలితంగా రూపొందింది. బిన్నీ తన తదుపరి వెంచర్ ను ప్రారంభిస్తున్నప్పుడు మేము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు భారతీయ రిటైల్ ఎకోసిస్టమ్ పై అతను చూపిన లోతైన ప్రభావానికి ధన్యవాదాలు’’ అన్నారు.

WhatsApp channel