Covid Review Meet: మళ్లీ కొవిడ్ గుబులు! కేంద్రం కీలక సమావేశం: వివరాలివే-covid review meet union health minister mansukh mandaviya to chair coronavirus review meet today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Covid Review Meet: మళ్లీ కొవిడ్ గుబులు! కేంద్రం కీలక సమావేశం: వివరాలివే

Covid Review Meet: మళ్లీ కొవిడ్ గుబులు! కేంద్రం కీలక సమావేశం: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 21, 2022 11:06 AM IST

Covid Review Meet: చైనాలో కొవిడ్-19 విజృంభిస్తుండటంతో భారత్ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. నేడు వైద్య శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చలు జరపనున్నారు. విదేశీ ప్రయాణ ఆంక్షలపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Covid Review Meet: మళ్లీ కొవిడ్ గుబులు! కేంద్రం కీలక సమావేశం: వివరాలివే
Covid Review Meet: మళ్లీ కొవిడ్ గుబులు! కేంద్రం కీలక సమావేశం: వివరాలివే

Covid-19 Review Meet: చైనాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. మరికొన్ని దేశాల్లోనూ ప్రభావం కనిపిస్తోంది. ఈ తరుణంలో భారత్‍లోనూ కొవిడ్-19 ఆందోళన మొదలైంది. దీంతో ముందస్తు చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో మరోసారి వైరస్ విజృంభించకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యల గురించి సమాలోచనలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్‍సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) బుధవారం (డిసెంబర్ 21) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కరోనా మళ్లీ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చించనున్నారు.

ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయా?

Covid-19 Review Meet: కొవిడ్-19 కట్టడి గురించి నిర్వహించే సమావేశంలో ముఖ్యంగా ఆరు అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియా.. అధికారులతో చర్చించే అవకాశం ఉంది. అంతర్జాతీయ, దేశీయ ఎయిర్‌పోర్టుల ద్వారా వచ్చే వారికి టెస్టులు చేసి పాజిటివ్ నమోదైతే వారిని ఆపేయడం, విదేశాల నుంచి వచ్చే వారికి మళ్లీ నిబంధనలు విధించడం లాంటివి అందులో ఉండనున్నాయి. అలాగే నూతన సంవత్సరం కోసం వేరే దేశాలకు వెళ్లి తిరిగి వచ్చే భారతీయులపై కూడా పర్యవేక్షణ ఉంచాలా అన్న విషయం కూడా చర్చకు రానుంది. అయితే, కొన్ని దేశాల నుంచి ప్రయాణాలపై ఆంక్షలు ఏమైనా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా కొత్త వేరియంట్ల గుర్తింపుపైనా కూడా సమీక్ష జరనుందని సమాచారం.

ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచనలు చేసింది. వేరియంట్‍లను గుర్తించేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది సర్కార్. “జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో కొత్త కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దీంతో వేరియంట్లను ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేస్ శాంపిళ్లను INSACOG ద్వారా జీనోమ్ స్వీక్వెన్సింగ్‍కు పంపాలి” అని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ లేఖలు పంపారు.

చైనాలో పరిస్థితి మరింత తీవ్రం

Covid in China: చైనాలో కొవిడ్-19 మరోసారి విపరీతంగా వ్యాపిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏకంగా చైనాలోని 60 శాతం మందికి వైరస్ సోకుతుందని ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడైంది. దీంతో పాటు మృతులు కూడా లక్షల్లో ఉంటారని కూడా హెచ్చరించింది. జీరో కొవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవల సడలించింది. ఇక ఇప్పటి నుంచి చైనాలో కరోనా వ్యాప్తి మరింత అధికమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు జపాన్, దక్షిణ కొరియాలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

WhatsApp channel