Budget 2024: బ్లాక్ బడ్జెట్, డ్రీమ్ బడ్జెట్, క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్.. ఇలా మన బడ్జెట్ లలో చాలా విశేషాలున్నాయి..-black budget dream budget carrot and stick budget a look back at indias union budgets history ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: బ్లాక్ బడ్జెట్, డ్రీమ్ బడ్జెట్, క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్.. ఇలా మన బడ్జెట్ లలో చాలా విశేషాలున్నాయి..

Budget 2024: బ్లాక్ బడ్జెట్, డ్రీమ్ బడ్జెట్, క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్.. ఇలా మన బడ్జెట్ లలో చాలా విశేషాలున్నాయి..

Sudarshan Vaddanam HT Telugu
Jan 31, 2024 03:19 PM IST

Budget 2024: 1947 లో మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మధ్యంతర బడ్జెట్లతో సహా 89 కేంద్ర బడ్జెట్లు వచ్చాయి. ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది 90వ కేంద్ర బడ్జెట్ (Budget 2024).

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Union budgets history: 1947లో అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె.షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టిన స్వతంత్ర భారత తొలి బడ్జెట్ నుంచి కేంద్ర బడ్జెట్ లో చాలా మార్పులు వచ్చాయి. 1973 లో నాటి ఆర్థిక మంత్రి వై.బి.చవాన్ ప్రవేశపెట్టిన 'బ్లాక్ బడ్జెట్', 1997 లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశ పెట్టిన 'డ్రీమ్ బడ్జెట్' అయినా.. భారత ఆర్థిక చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు బాటలు వేశాయి.

చరిత్రాత్మక బడ్జెట్

భారత దేశ ముఖ చిత్రాన్ని మార్చిన బడ్జెట్ 1991 జూలై 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్. ఆ బడ్జెట్ రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వృద్ధికి దిశానిర్దేశం చేసింది. చెల్లింపుల సమతుల్యత సంక్షోభం, సోవియట్ కూటమి పతనం, రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణం, దిగుమతులపై అతిగా ఆధారపడటం భారత దేశాన్ని ఆర్థిక పతనం అంచుల్లోకి నెట్టాయి. బడ్జెట్ కు ముందు ఒక దశలో భారత విదేశీ మారక నిల్వలు కేవలం 1.1 బిలియన్ డాలర్లకు (లేదా అప్పట్లో రూ.2,500 కోట్లు) క్షీణించాయి, ఇది రెండు వారాల దిగుమతులకు కూడా సరిపోని పరిస్థితి. ఆ పరిస్థితిని సమూలంగా మార్చి, మళ్లీ ప్రగతి పట్టాలు ఎక్కించిన బడ్జెట్ గా ఆ 1991 బడ్జెట్ భారత దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఆ ఐకానిక్ బడ్జెట్ కు రాజకీయ వర్గాల్లో ఆదరణ లభిస్తోంది.

89 కేంద్ర బడ్జెట్లు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 89 కేంద్ర బడ్జెట్లు వచ్చాయి. వాటిలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన 12 మధ్యంతర బడ్జెట్లు కూడా ఉన్నాయి. దేశ 90వ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ నిలిచారు. ఆయన 10 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆ తరువాత, రెండో స్థానంలో తొమ్మిది బడ్జెట్లతో కాంగ్రెస్ నేత చిదంబరం ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు 75% కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టగా, భారతీయ జనతా పార్టీ 19% ప్రవేశపెట్టింది.

సుదీర్ఘ బడ్జెట్

మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్ (Budget) ప్రసంగంలోని పదాల సంఖ్య 18,650. పదాల సంఖ్య పరంగా ఇది సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం. అయితే, సమయం పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. 2020లో 2 గంటల 42 నిమిషాల నిడివి గల ప్రసంగాన్ని ఆమె చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హీరూభాయ్ ఎం పటేల్ అతి తక్కువ పదాలున్న బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆయన చేసిన 1977 మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలు ఉంది.

ద్రవ్య లోటు కథ

ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులకు కొలమానమైన భారత ద్రవ్యలోటు ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. తొలినాళ్లలో జాగ్రత్తగా ఖర్చు చేయడం వల్ల ద్రవ్య లోటు జీడీపీలో 5 శాతం కంటే తక్కువగా ఉండేది. కానీ 1980వ దశకంలో సబ్సిడీలు, సంక్షేమంపై దృష్టి సారించడంతో ఇది 8.3 శాతానికి పెరిగింది. 1991 సంస్కరణల తరువాత, దీనిని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయి. దీనిని 2007-08 నాటికి జిడిపిలో 3% కు తగ్గించాలని 2003 లో రూపొందిన చట్టం మార్గదర్శకాలను ఇచ్చింది. కొవిడ్-19 మహమ్మారి, ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో 2020-21లో ఇది 9.2 శాతానికి పెరిగింది. 2025-26 నాటికి దీనిని 4.5 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మధ్యంతర బడ్జెట్లు

కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు స్వల్పకాలం పాటు వ్యయాన్ని నిర్వహించడం లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్ లను ప్రవేశపెడ్తారు. 2000 నుండి, నాలుగు మధ్యంతర బడ్జెట్లు వచ్చాయి. రెండు తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి.

నెహ్రూ ప్రవేశపెట్టిన బడ్జెట్

ప్రధాని ఆర్థికమంత్రిగా బడ్టెట్ ను ప్రవేశపెట్టడం ఇప్పటివరకు 3 సార్లు జరిగింది. 1958లో జవహర్ లాల్ నెహ్రూ, 1970లో ఇందిరాగాంధీ, 1987లో రాజీవ్ గాంధీ వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. నాటి తమ ఆర్థికమంత్రులు రాజీనామాలు చేయడంతో వారు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు.

ఆహారం కోసం 70 శాతం

ప్రభుత్వ ఆదాయంలో 80 శాతానికి పైగా పన్నుల ద్వారా సంపాదించాలని స్వతంత్ర భారత తొలి బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 1947లో దేశవిభజనతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రక్షణ, శరణార్థుల పునరావాసం, నిర్వాసితులకు ఆహారం అందించేందుకు బడ్జెట్లో దాదాపు 70 శాతం ఖర్చు చేశారు. ప్రభుత్వం బడ్జెట్ లో 10% అప్పులు తీర్చడానికి, మరో 10% పరిపాలనకు ఖర్చు చేసింది.

WhatsApp channel